Kishan Reddys anger over Lathicharge on BJP workers :


నిర్మల్ లో నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేశారు. అక్కడినుంచి బీజేపీ నాయకులను చెదరగొట్టారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. నిర్మల్ లో వందల ఎకరాల భూమిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన బంధువులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఆ భూములకు అనుకూలంగానే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపొందించారని విమర్శించారు.


" మాస్టర్ ప్లాన్ లోని లోసుగులను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలపై పోలీసు లాఠీ చార్జి చేశారు. నిర్మల్కు వెళ్తున్న బీజేపీ నాయకులు అరెస్టు చేసి ఇక్కడికి తరలించారు కూడా తెలియదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు అనేక అక్రమాలు చేస్తున్నారు" అని కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.


అసలు ఏం జరిగిందంటే....
నిర్మల్ పట్టణ నూతన బృహత్ ప్రణాళిక రద్దు (Nirmal Master Plan Cancel) అంశంపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం క్షీణించిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని నేతలు మండిపడ్డారు. నిర్మల్ లో బీజేపీ కార్యకర్తలు చేపట్టిన రాస్తారోకో స్వల్ప ఉద్రిక్తత దారితీసింది. రోడ్డుపై బైఠాయించి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించడంతో లాఠీ చార్జి జరిగింది. 


ఓటమి భయంతోనే బీజెపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుంది. ఇటువంటి సమయంలో బీజేపీ కార్యకర్తలు నాయకులు సమన్వయం పాటించాలి. రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలవబోతుందని  బీఅర్ ఎస్ నిరాశ, నిస్పృహతో ఇలాంటి కుట్రలు చేస్తుంది. ఆ కుట్రలో బీజేపీ కార్యకర్తలు పడకుండా సమన్వయం పాటించాలి.' అని కిషన్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు.


బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇచ్చిన జోష్ తెలంగాణ బీజేపీ లో స్పష్టంగా కనిపిస్తుంది. టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ దూకుడు పెంచడానికి బీజేపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పై అన్ని వైపు నుంచి దాడి చేసి ఊపిరాడనివ్వకుండా చేయాలని బీజేపీ అధినాయకత్వం స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేయడంతో కిషన్ రెడ్డి సారథ్యంలో బీజేపీ నేతలు రంగంలోకి దిగుతున్నారు.


బీఆర్ఎస్ సర్కార్ కు ఊపిరి ఆడనివ్వని వ్యూహాలతో బీజేపీ అస్త్రాలను సందిస్తుంది. ఇక కేసీఆర్ వ్యతిరేక ప్రచారానికి సోషల్ మీడియాని కూడా జోరుగా వాడుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల్లోకి ఎంత వ్యతిరేకత తీసుకువెళ్లగలిగితే అంత లాభిస్తుంది అన్న భావన వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు వచ్చే ఎన్నికలలో అధికారం కట్టబెట్టడానికి ఏ మాత్రం ఉపయోగపడతాయి అన్నది ఎన్నికల ఫలితాలతో తేలనుంది.