- రేపు ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి బయలుదేరనున్న నేతలు
- 11 గంటలకు కేస్లాపూర్ చేరుకోనున్న అర్జున్ ముండా, బండి సంజయ్
- గిరిజన ఆరాధ్యదైవమైన నాగోబాను దర్శించుకోనున్న నేతలు
- అనంతరం గిరిజనులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న నేతలు
- కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల రాకతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న జిల్లా నేతలు
- మధ్యాహ్నం సభలో పాల్గొని ప్రసంగించనున్న అర్జున్ ముండా, బండి సంజయ్
- సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న నేతలు
రేపు నాగోబా జాతరకు రానున్న కేంద్ర గిరిజన శాఖ మంత్రి
కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ ముండా తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కొలువైన ఆదివాసీల ఆరాద్య దైవం నాగోబాను దర్శించుకునేందుకు అర్జున్ ముండా రానున్నారు. ఆదివారం ఉదయం 10:45 గంటలకు హెలికాప్టర్ లో అర్జున్ ముండాతో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కేస్లాపూర్ చేరుకోనున్నారు. ఉదయం 11:00 గంటలకు నాగోబాను దర్శించుకొని మెస్రం వంశీయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడతారు. అనంతరం జాతరను సందర్శించి ఆదివాసీల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు అర్జున్ ముండా, బండి సంజయ్.
అనంతరం స్థానిక నాగోబా దర్బార్ హాలులో ఎర్పాటు చేసిన సభలో అర్జున్ ముండా పాల్గోననున్నారు. ఆపై తిరిగి కేస్లాపూర్ నుండి హెలికాప్టర్ ద్వారా కేంద్ర మంత్రితో పాటు ఎంపీ బండి సంజయ్ హైదరాబాద్ చేరుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేస్లాపూర్ లో ఎర్పాటు చేసిన హెలిఫ్యాడ్ ను పోలిస్ ఉన్నతాధికారులు పరిశీలించి కేంద్ర మంత్రి రానున్న క్రమంలో పటిష్ట బందోబస్తు ఎర్పాటు చేశారు.
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఈనెల 21న ప్రారంభమయ్యే ఆదివాసిల నాగోబా జాతర సందర్భంగా 22వ తేదీన కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా రానున్నట్లు ఆదిలాబాద్ ఎంపి సోయం బాపురావ్ తెలిపారు. నాగోబా జాతర ఈనెల 21న అర్థరాత్రి మహాపూజతో అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతుంది. కావున జాతరకు వేలాది సంఖ్యలో ఆదివాసీలు వివిధ రాష్ట్రాల నుంచి తరలిరానున్నారు. జాతరకు అన్ని విధాల ఏర్పాట్లు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా రానున్న తరుణంలో ఆదివాసిలు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రిని ఆహ్వానించి స్వాగతం పలకాలని ఆయన మేస్రం వంశీయులతో కలిసి కోరారు.
హెలిప్యాడ్ ను పరిశీలించిన ఎంపి సోయం బాపురావ్
మర్రిచెట్ల నీడలో ఉన్న మేస్రం వంశ పెద్దలతో కలిసి మాట్లాడారు. అక్కడి నుండి ఆలయం వరకు నడుస్తు వెళ్ళి ఆలయం వెనకాల గల హెలిపాడ్ ను సందర్శించారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి రానున్న తరుణంలో అన్ని ఏర్పాట్లు సజావుగా సాగేలా స్థానిక పెద్దలతో చర్చించారు. అటు నాగోబా ఆలయం మహాపూజతో ప్రారంభం కానున్న జాతర నేపథ్యంలో రంగు రంగుల విద్యుత్ కాంతులతో ఆలయం ముస్తాబైంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల సౌలభ్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.