Telangana News | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో స్పెషల్ టైగర్ కారిడార్ ఏర్పాటునూ తెలంగాణ ప్రభుత్వం విరమించుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.


ఏకపక్షంగా నిర్ణయాలు సరికాదన్న ఎమ్మెల్యే


సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ... PCCF ఇటీవల జిల్లాను సందర్శించినప్పుడు ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో టైగర్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని తెలియజేయడం అన్యాయమన్నారు. ప్రజలను గాని, ప్రజాప్రతినిధులను గాని సంప్రదించకుండా అధికారులు నేరుగా ఇలా ప్రతిపాదనలు చేసి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తే కచ్చితంగా ప్రతిఘటిస్తామన్నారు. తగిన ప్రణాళికలులేకుండా ఊర్లను తరలిస్తామని అధికారులు చెప్తున్నారని, ఈ విధానాన్ని భారతీయ జనతా పార్టీ (BJP) వ్యతిరేకిస్తుందని ఎమ్మెల్యే హరీష్ బాబు తెలిపారు.


జిల్లాలో టైగర్ కారిడార్ ప్రతిపాదనను వెంటనే విరమించుకొని, పెద్దపులి వలన తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డా.కొత్తపల్లి శ్రీనివాస్, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, మాజీ జడ్పీటిసి అరిగేలా నాగేశ్వర్ రావు, మాజీ ఎంపిపి అరిగేలా మల్లికార్జున్, కొట్రంగి విజయ్, సతీష్, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, కృష్ణ కుమారి మల్లిక్, జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు శ్రీదేవి, అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి, సుదర్శన్ గౌడ్, ఖాండ్రే విశాల్ మరియు అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.


మహిళపై దాడి చేసిన పులి
బజార్ హత్నూర్ మండలం డెడ్రా గ్రామానికి చెందిన అర్క భీంబాయి బహిర్భూమికి వెళ్లిన సమయంలో చిరుతపులి ఆమెపై దాడి చేసింది. చిరుత దాడిలో ఆమె కుడి కన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఎలాగోలా పులి బారి నుంచి తప్పించుకుని, కంగారు పడుతూ వచ్చిన ఆమెను స్థానికులు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. మహిళపై చిరుత దాడి చేయడంతో తమకు అలాంటి పరిస్థితి వస్తుందేమోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే వణికిపోతున్న రైతులకు చిరుత సంచారం కంటి మీదక కునుకు లేకుండా చేస్తోంది. 


వేర్వేరు చోట్ల దాడులు చేసింది ఒకటే పులి


ఇటీవల వేర్వేరు చోట్ల ఇద్దరిపై దాడి చేసిన పులి ఒకటేనని ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆర్.ఎం డోబ్రియాల్ వెల్లడించారు. ఇటీవల కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. కాగజ్‌నగర్‌ డివిజన్ అటవి ప్రాంతాన్ని చూడాలనే ఉద్దేశ్యంతో వచ్చినట్లు అధికారులకు, స్థానికులకు పిసీసీఎఫ్ డోబ్రియాల్ తెలిపారు. దాదాపు రెండు రోజులపాటు కాగజ్‌నగర్‌ తో పాటు పెంచికల్ పేట్, సిర్పూర్ అటవీ ప్రాంతాలను పరిశీలించారు. కాగజ్‌నగర్‌ డివిజన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాగజ్‌నగర్‌ డివిజన్ ను ప్రత్యేక టైగర్ కారిడార్ (Tiger Corridor)గా డెవలప్ చేసే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను కన్జర్వేషన్ ఆఫ్ పారెస్ట్ కార్యాలయానికి పంపిస్తామని.. త్వరలోనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. 


Also Read: Tiger Attack In Komaram Bheem Asifabad: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరిపై దాడి చేసింది ఒకే పులి, స్పష్టం చేసిన అధికారి