Telangana News | ఆదిలాబాద్: జిల్లాలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో అటవీశాఖ అధికారుల చర్యలకు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అడ్డుకట్ట వేశారు. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలను అడ్డుకోవద్దని సంబంధిత జిల్లాల అటవీ అధికారుకారులకు సూచనలు జారీ చేయాలని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వెటర్ ను కొండా సురేఖ ఆదేశించారు. 

Continues below advertisement


ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్ లో మంగళవారం కలిశారు. రాత్రి వేళల్లో అటవీ చెక్ పోస్టుల వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి ఎఫ్డిపీటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు రిక్వెస్ట్ లేఖపై స్పందించిన మంత్రి ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని పిసిసిఎఫ్ కు సూచించారు. రాత్రి వేళల్లో అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలకు అనుమతించాలని పిసిసిఎఫ్ ను ఆదేశించారు.




జనవరి మొదటి వారంలో వాహనాలు నిలిపివేసిన అధికారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాహనాలు వెళ్ళకూడదని అటవీ అధికారులు తీసుకొచ్చిన నిబంధనలు స్థానికులను ఇబ్బందులకు గురిచేశాయి. ఈ క్రమంలో జనవరి 4న రాత్రి ఉట్నూర్ మండలంలోని కొత్తగూడ చెక్ పోస్ట్ వద్ద పలు వాహనాలను చెక్ పోస్ట్ సిబ్బంది నిలిపివేశారు. ఆ సమయంలో వాహనాలను అనుమతించేది లేదని అటవీశాఖ అధికారులు, చెక్ పోస్ట్ సిబ్బంది చెప్పడంతో వాహనదారులు షాకయ్యారు. 


అర్థరాత్రి పూట చెక్ పోస్ట్ వద్దకు ఎమ్మెల్యే
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు కొందరు వాహనదారులు ఫోన్ చేసి విషయం చెప్పారు. చెక్ పోస్ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయని సమాచారంతో ఎమ్మెల్యే అర్ధరాత్రి  హుటాహుటిన కారులో కొత్తగూడ చెక్ పోస్ట్ కు చేరుకున్నారు. ప్రయాణికులతో మాట్లాడిన ఆయన.. తీవ్ర చలితో వారు పడుతున్న బాధలు చూసి చెక్ పోస్ట్ సిబ్బందిని నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రాత్రివేళ వాహనాలు అనుమతించడం లేదని చెక్ పోస్ట్ సిబ్బంది చెప్పడంతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నిర్మల్ ఎఫ్డిపిటి శాంతారాంకు ఫోన్ చేసి విషయం చెప్పారు. తాను ఎమ్మెల్యేనే కాకుండా వైల్డ్ లైఫ్ బోర్డు సభ్యుడినని, తమకు తెలియకుండా కొత్త నిబంధనలు ఎలా తీసుకొచ్చారని ప్రశ్నించారు. 


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికమైంది. చలిలో అర్ధరాత్రి పూట కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని, వారిలో పసిపిల్లలు, వృద్ధులు సైతం ఉన్నారని తెలిపారు. ఆదిలాబాద్ డిఎఫ్ఓతో సైతం ఖానాపూర్ ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడి పరిస్థితి వివరించారు. అధికారుల ఆదేశం మేరకు బిర్సాయిపేట రేంజ్ అధికారి వాహనాలు వెళ్లేందుకు అనుమతించారు. రాత్రిపూట వచ్చి తమకు సహాయం చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. తాను త్వరలోనే ఈ విషయాన్ని మంత్రి, లేక సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఈ క్రమంలో సరిగ్గా నెల రోజులకు అటవీశాఖ మంత్రి కొండా సురేఖను కలిసి సమస్య వివరించి, లేఖ అందజేశారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలకు సహకరించాలని అధికారులకు సూచించారు.


Also Read: Telangana Assembly: ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన