Revanth Reddy on SC classification:  తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ రిపోర్టును శాసనసభలో ప్రవేశపెట్టారు.  ఎస్సీ కులాల ఉప వర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోనే మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఎస్సీ రిజర్వుడు కేటగిరీలో ఉప వర్గీకరణపై పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ దవిందర్సింగ్ అండ్ అదర్స్  కేసులో తీర్పు వెలువరించిన రోజున  ఇదే శాసన సభలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటన చేశామన్నారు. 


ఎస్సీల వర్గీకరణ అమలు చేసే బాధ్యతను  తీసుకుంటామని అదే రోజున మాట ఇచ్చామన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా న్యాయ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచే కార్యాచరణ చర్యలు చేపట్టిందన్నారు. గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అధ్యయనం చేయటం, ఈ తీర్పుతో ముడిపడి ఉన్న వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్లే మార్గాలను సూచించటంతో పాటు అవసరమైన సిఫారసులు చేయాలని కోరుతూ  మంత్రివర్గ సబ్ కమిటీని నియమించామన్నారు. కమిటీ పలు దఫాలుగా సమావేశమై విస్తృతంగా చర్చలు జరిపిందన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్సీల ఉప కులాల వర్గీకరణ అమలు తీరును అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారుల బృందాన్ని పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలకు పంపించిందని..  సుప్రీంకోర్టు తీర్పు అమలుకు అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహాను స్వీకరించింది. విస్తృత సమావేశాలు, సంప్రదింపుల అనంతరం వర్గీకరణపై లోతైన అధ్యయనం కోసం ఏకసభ్య న్యాయ కమిషన్‌ వేయాలని కమిటీ సిఫారసు చేసిందని రేవంత్ తెలిపారు 


కమిటీ సిపారసు ప్రకారం  రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 11వ తేదీన డాక్టర్ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ అధ్వర్యంలో ఏక సభ్య న్యాయ కమిషన్‌ను  ఏర్పాటు చేసిందన్నారు. ఎస్సీల్లోని ( 59 కులాల జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయం మరియు రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన డేటాను అన్ని ప్రభుత్వ విభాగాలు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణ కమిషన్ సేకరించింది.   అన్ని విభాగాల నుంచి అందిన సమాచారాన్ని కమిషన్ క్షుణ్నంగా పరిశీలించి తమ నివేదికను తయారు చేసింది. కేవలం 82 రోజుల వ్యవధిలో ఫిబ్రవరి 3వ తేదీన కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని తెలిపారు.              


వర్గీకరణ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి.. కానీ తీర్మానాన్ని పెట్టి ఆమోదించే అవకాశం తనకు మాత్రమే లభించిందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రికి రాని అవకాశం వచ్చిందన్నారు. తన కోసం ఓ పేజీ రాసుకోవాల్సి వస్తే ఈ రోజును రాసుకుంటానని రేవంత్ రెడ్డి తెలిపారు.