నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వివాదాలకు నిలయంగా మారుతోంది. మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగులకు భద్రత లేకుండాపోయింది. చెప్పింది చేయకుంటే అధికారులను టార్గెట్ చేస్తున్నారు ప్రజాప్రతినిధులు. వారిపై దాడులకు సైతం వెనకాడటం లేదు. ఓ వైపు రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు అధికార ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నారు. ప్రజాప్రతినిధుల మాట కాదంటే అదో రకమైన టార్చర్. పోనీలే అనుకొని వారు చెప్పినట్లు నడుచుకుంటే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తోంది. ఇలా ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది అధికారుల పరిస్థితి. ఏకంగా కార్పొరేషన్ ఇంజనీరైపైనే దాడికి తెగబడ్డ వైనం నిజామాబాద్ నగరంలో చర్చనీయాంశమైంది. నగర అభివృద్ధిపై ద్యాసను మరిచిన ప్రజాప్రతినిధులు అక్రమాలకు పాల్పడుతూ ప్రజల్లో అభాసుపాలవుతున్నారు. తమ అక్రమాలకు అధికారులు సహకరించకుంటే వారిని టార్గెట్ చేస్తున్నారు. వారిపై దాడులకు సైతం దిగుతున్నారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌లో ప్రజాప్రతినిధులు తీరుపై ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవలే ఈఈ హరికిశోర్ ఛాంబర్లో కొందరు మహిళలు గంపుగా వెళ్లి అతనిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అవమానం భరించలేక ఈఈ హరి కిషోర్ ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. అతనిపై జరిగిన దాడికి ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోయారు. దాడితో పాటు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో సదరు అధికారి మిన్నుకుండిపోయినట్లు తెలుస్తోంది.
-
అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కనుసన్నుల్లో కార్పొరేషన్ నడుస్తోంది. అధికారంతో అనుకున్న పనులు చక్కదిద్దుకోవడానికి వెనుకడుగు వేయడన్న పేరుంది. సదరు నాయకుడిపై ఇప్పటికే కొన్ని ఆరోపణలు ఉన్నాయ్. ఆ నేత తిలక్ గార్డెన్ మున్సిపల్ మడిగెలను తాను చెప్పిన పేరున బదిలీ చేయాలని అధికారిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారంగా సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో హరి కిశోర్ పై ఒత్తిడి తీసుకువచ్చారు. అయినప్పటికీ ఇంజనీర్ హరికిశోర్ తాను చేయలేనంటూ చేతులెత్తేసినట్లు తెలిసింది. దీంతో పాటు పలు బిల్లులపై సంతకాల విషయంలో కూడా గొడవలు జరిగినట్లుగా కార్పొరేషన్ లో చర్చ జరుగుతోంది. అందుకే హరి కిషోర్ పై దాడి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయ్. అయితే దాడికి గురైన ఇంజనీరింగ్ స్థానికంగా లేకపోవడంతో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పెన్ డౌన్ చేసి ఆందోళనకు దిగారు. దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యోగులు చెబుతున్నారు.
కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ లాంటి అధికారిపై దాడి జరిగితే ఉద్యోగ సంఘాలు, ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. దాడి జరిగి నాలుగు రోజులైనా కమిషనర్ తోపాటు కలెక్టర్ స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దాడి జరిగినట్లు కార్పొరేషన్ కార్యాలయంలో అధికారిపై దాడి జరిగినట్లు సీసీ పుటేజీలో కూడా ఉంది. సీసీ పుటేజీ ఆధారంగా దాడి చేసిన వారు ఎవరనేది గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. కానీ ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణళు వినిపిస్తున్నాయ్.
కార్పొరేషన్లో అధికారులపై విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు.... మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. ఇందుకే కొన్ని రోజుల క్రితం డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న రవిబాబు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. అనంతరం మరో చోటికి బదిలీ చేయించుకున్నారు. కొద్ది నెలల క్రితం డిప్యూటీ కమిషనర్ విధుల్లో చేరిన స్వరూపారాణి రెండ్రోజులు కూడా పని చేయలేదు. కార్పొరేషన్ పరిస్థితిని తెలుసుకుని లాంగ్ లీవ్ పెట్టారు. మరి కొందరు ఉద్యోగులు కూడా ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం రాజకీయ ఒత్తిళ్లు మూలంగానే విపరీతమైన అక్రమాలు జరుగుతునే ఉన్నాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారు. మూడేళ్ల క్రితం ఈఈగా ఉన్న వెంకటేశ్వర్ అనే అధికారి సైతం ప్రజా ప్రతినిధుల ఒత్తిడి భరించలేక బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సైతం వెలుగు చూసింది. అయినా ప్రజాప్రతినిధుల తీరులో మార్పు రావటం లేదు.