Pea Seeds Ganesh 2022: పర్యావరణాన్ని పరిరక్షిస్తూ బఠానీ విత్తనాలతో వినాయక విగ్రహాన్ని ఎర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని కాపువాడకు చెందిన శ్రీ సాయి గణేష్ మండల్ యువకులు. గత 20 సంవత్సరాలుగా వినూత్న రీతిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.


25 కిలోల బఠానీలతో..


కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని కాపువాడ కాలనికి చెందిన యువకులు ప్రతియేటా వినూత్న రీతిలో వినాయక విగ్రహాన్ని ఎర్పాటు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీ సాయి గణేష్ మండల్ ఆద్వర్యంలో గత 20 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది కూడా కొత్తగా ఏదైనా ప్రయోగం చేయాలనుకున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షంచేదిగా ఉండాలనుకున్నారు. ఈ క్రమంలోనే 25 కిలోల బఠానీ విత్తనాలతో వినూత్న రీతిలో వినాయక విగ్రహాన్ని ఎర్పాటు చేశారు. 



ప్రతి ఏటా ప్రత్యేక రూపాల్లో.. 


మట్టి, కొబ్బరి కాయలు, కూరగాయలు, ఆకులు, జెమ్స్, సన్నాయి వాయిద్యాలు, తాళ్లు, పేపర్లు, రూపాయి బిళ్లలు.. ఇలా చాలా రకాల వినాయకులనే మనం చూశాం కానీ ఇది వీటికి మించింది కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎక్కడా బఠానీ వియాకుడిని చూడకపోవడంతో పట్టణ వాసులంతా ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. చూపిన వారంతా ఎవరు తయారు చేశారో కనుక్కొని మరీ ఆ కళాకారులను అభినందిస్తున్నారు. ప్రతియేటా వివిధ కళా రుపాలతో, వినూత్న రీతిలో భక్తులను ఆకట్టుకునేలా వినాయక విగ్రహలను ఎర్పాటు చేస్తున్నారని స్థానిక యువకుడు జయచందర్ చెప్పాడు. 




ఆదిలాబాద్ నూతి వినాయకుడు మరింత స్పెషల్..


తెలంగాణలో అతి పెద్ద భారీ వినాయక విగ్రహం ఖైరతాబాద్ వినాయకుడు అయితే.. అతి పెద్ద భారీ వినాయక విగ్రహాలలో ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్ పేట్ లో గల కుమార్ జనత గణేష్ మండల్ ఆధ్వర్యంలో గత 49 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లో భాగంగా కుమార్ జనత గణేష్ మండల్ ఆధ్వర్యంలో 33 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఎర్పాటు చేశారు. దీనికి మరో పేరు కూడా ఉంది. పూర్వ కాలం నుండి పెద్దలు దీన్ని "నూతి మీది గణపతి" అని పిలుస్తున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే విగ్రహాన్ని ఆవిష్కరించిన చోటే నిమజ్జనం చేస్తారు.


నూతిలోనే నిమజ్జనం.. 


అక్కడ పెట్టే వినాయక విగ్రహం కింద పెద్ద పూరాతన బావి ఉంది. పూర్వం పెద్దలు చేపట్టిన వినాయక చవితి వేడుకల కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని నేటికి ఈ పూర్వకాల పద్దతిలో నూతి పైనే.. వినాయక విగ్రహాన్ని ఆవిష్కరించి వేడుకలు నిర్వహిస్తున్నారు. చివరి రోజున నిమజ్జనం సైతం ఈ నూతి పైనే ఇక్కడే నిమజ్జనం చేస్తున్నారు. ఇది గత 49 సంవత్సరాలుగా చేస్తున్నట్లు కుమార్ జనత గణేష్ మండల్ అధ్యక్షులు తోట పరమేశ్వర్ చెబుతున్నారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం అయ్యే కంటే ముందే ఈ నూతి పైన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏర్పాట్లు పూర్తి చేసి వేడుకలకు సిధ్దం కావడం జరుగుతుందని, ఇలా ప్రతి యేటా తమ పెద్దల నుండి వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు.