Biggest Ganesh 2022: రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో అతి పెద్ద భారీ వినాయక విగ్రహం ఖైరతాబాద్ వినాయకుడు అయితే.. అతి పెద్ద భారీ వినాయక విగ్రహాలలో ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్ పేట్ లో గల కుమార్ జనత గణేష్ మండల్ ఆధ్వర్యంలో గత 49 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లో భాగంగా కుమార్ జనత గణేష్ మండల్ ఆధ్వర్యంలో 33 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఎర్పాటు చేశారు. దీనికి మరో పేరు కూడా ఉంది. పూర్వ కాలం నుండి పెద్దలు దీన్ని "నూతి మీది గణపతి" అని పిలుస్తున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే విగ్రహాన్ని ఆవిష్కరించిన చోటే నిమజ్జనం చేస్తారు.


నూతిలోనే నిమజ్జనం.. 
అక్కడ పెట్టే వినాయక విగ్రహం కింద పెద్ద పూరాతన బావి ఉంది. పూర్వం పెద్దలు చేపట్టిన వినాయక చవితి వేడుకల కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని నేటికి ఈ పూర్వకాల పద్దతిలో నూతి పైనే.. వినాయక విగ్రహాన్ని ఆవిష్కరించి వేడుకలు నిర్వహిస్తున్నారు. చివరి రోజున నిమజ్జనం సైతం ఈ నూతి పైనే ఇక్కడే నిమజ్జనం చేస్తున్నారు. ఇది గత 49 సంవత్సరాలుగా చేస్తున్నట్లు కుమార్ జనత గణేష్ మండల్ అధ్యక్షులు తోట పరమేశ్వర్ చెబుతున్నారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం అయ్యే కంటే ముందే ఈ నూతి పైన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏర్పాట్లు పూర్తి చేసి వేడుకలకు సిధ్దం కావడం జరుగుతుందని, ఇలా ప్రతి యేటా తమ పెద్దల నుండి వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు.


అతిపెద్ద విగ్రహాలలో ఒకటి.. 
ఈ యేడాది తెలంగాణలో భారీ పెద్ద వినాయకుడైన ఖైరతాబాద్ వినాయకుడి తరువాత అతి పెద్ద వినాయక విగ్రహాలలో ఒకటి ఆదిలాబాద్ లో తమ కుమార్ జనత గణేష్ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ప్రతి యేటా వివిధ కళ రుపాలతో ఒక్కో విధంగా వినూత్న రీతిలో కనిపించేలా వినాయక చవితి స్పెషల్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు తెలిపారు.


33 అడుగుల విగ్రహం.. 
33 అడుగుల విగ్రహం ఎంతో చక్కగా ఉంది. నిల్చున్న ఫోజులో ఉన్న ఈ గణనాథుడి పక్కనే అతి భారీ ఎలుక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. పసుపు రంగు పంచె పైన లేత గులాబీ కలర్ లో మరో పంచెలో గణనాథుడు కొలువు దీరాడు. మెడలో బ్లూ కలర్ కండువా చూడ చక్కగా ఉంది. ఆదిలాబాద్ లో కొలువు దీరిన ఈ అతి పెద్ద విగ్రహాన్ని చూసేందుకు ఆదిలాబాద్ జిల్లా వాసులతో పాటు పక్కనే ఉన్న ఇతర జిల్లాల నుండి భక్తులు తరలి వస్తున్నారు. పక్కనే ఉన్న మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలే కాకుండా, నిజామాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ కు చేరువలో ఉన్న గ్రామాల వాసులు ఆదిలాబాద్ కు తరలి వచ్చి ఈ బడా గణేష్ ను దర్శించుకుంటున్నారు.