కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను నాలుగు పులులు గత కొన్నిరోజులుగా వణికిస్తున్నాయి. అయితే తాజాగా ఓ పులి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రకు వెళ్లడం జిల్లా వాసులకు కాస్త ఊరటనిస్తోంది. ఇంకా జిల్లాలో జనావాసాల మధ్యకు మూడు పులులు వస్తున్నాయని రాత్రివేళ బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం నాగపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు పులిదాడి నుంచి తృటిలో తప్పించుకొని బయటపడ్డాడు. మంగళవారం ఉదయం కూరగాయలు తీసుకొని మహారాష్ట్రకు వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ సమీపంలో పెద్దపులి దాడి చేయడానికి ప్రయత్నించగా.. తాను తప్పించుకొని గ్రామంలోకి వెళ్లానన్నాడు. అటవిశాఖ అధికారులు సమాచారం తెలుసుకొని పులి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. పులి ప్రాణహితనది దాటిన అడుగులను చూసి ఎట్టకేలకు అది మహారాష్ట్రకు వెళ్లిపోయిందని నిర్ధారించారు. దీంతో జిల్లా వాసులు ఊపిరిపీల్చుకున్నారు.
మహారాష్ట్రకు వెళ్లిపోయిన ఒ పులి..
బెజ్జురు మండలం నాగపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు పులిదాడి నుంచి తృటిలో తప్పించుకొని బయటపడ్డాడు. మంగళవారం ఉదయం కూరగాయలు తీసుకొని మహారాష్ట్రకు వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ సమీపంలో పెద్దపులి దాడి చేయడానికి ప్రయత్నించిందన్నాడు. తాను తప్పించుకొని గ్రామంలోకి వెళ్లానన్నాడు. అటవీశాఖ అధికారులు పులి వెళ్ళిన ప్రాంతాన్ని ఉదయం పరిశీలించారు. బెజ్జూర్ మండలంలోని నాగేపల్లి, కోయపల్లి గ్రామాల మధ్య మహారాష్ట్రకు వెళుతున్న వ్యక్తులకి పులి కనపడటంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పులి కోసం గాలింపు చర్యలు చేపట్టిన అటవి అధికారులు.. ఆ పులి ప్రాణహిత నది దాటి వెళ్లినట్లు దాని అడుగుల ఆధారంగా ధ్రువీకరించారు. గ్రామస్తులు ఎవరు కూడా భయపడాల్సిన పనిలేదని, మళ్లీ ఎక్కడైనా పులి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు. 


వారం రోజుల నుంచి భయం గుప్పిట్లోనే జిల్లా ప్రజలు
గత వారం రోజులుగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నిత్యం ఎక్కడో ఒకచోట పులి కనిపించడం, అధికారులు సైతం దాని అడుగులను గుర్తించడంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వాంకిడి మండలం ఖానాపూర్ శివారులోని ఓ చేనులో సిడాం భీము అనే రైతుని సైతం హతమార్చడంతో పొలం పనులకు వెళ్లడానికి సైతం జంకారు. కాగజ్‌నగర్‌, సిర్పూర్ (టి), చింతలమానేపల్లి అటవీ ప్రాంతాల్లో పులి ఆనవాళ్లను అధికారులు నిర్ధారించారు. ఆ పులి దాడిలో రైతు చనిపోగా.. పదుల సంఖ్యలో పశువులు హతమయ్యాయి. దీంతో పశువులను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లడానికి కాపర్లు, పత్తి చేన్లకు వెళ్లడానికి రైతులు గజగజవణుకుతున్నారు. 
రైతును చంపిన పులి కాగజ్‌నగర్‌ డివిజన్ లోని అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది ఒకటేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆ పులి తన ఆవాసం కోసం దాదాపు 120 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసినట్లు అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు పులి సంచారంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు, సర్పంచులకు సైతం చెప్పారు గ్రామాల్లో డప్పు చాటింపు చేశారు. దీంతో ప్రజలు పంట పొలాలు, కూలీ పనులకు వెళ్లకుండా ఆపేశారు. ఎట్టకేలకు ఆ పులి ప్రాణహిత నది దాటి మహరాష్ట్ర వైపు వెళ్ళడంతో ప్రస్తుతం జిల్లా ప్రజలంతా హమ్మయ్యా అంటు ఊపిరి పిల్చుకున్నారు. 


తాజాగా మళ్ళీ పశువులపై పంజా విసిరిన పులి
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి మరోసారి పంజా విసిరింది. జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను వణికిస్తోంది. బెజ్జూర్‌ మండలం మర్తిడి బీట్ రెండుగుట్టల సంది ప్రాంతంలో సాయంత్రం మేతకు వెళ్ళిన పశువులపై పెద్దపులి దాడి చేసింది. కర్పద సుధాకర్ అనే వ్యక్తి యొక్క ఆవుపై దాడికి యత్నించింది. గమనించిన పశువుల కాపరి గట్టిగా అరవడంతో పెద్దపులి ఆవును వదిలి పారిపోయినట్టు సమాచారం. కాళ్ళకు తీవ్ర గాయాలతో ఆవు గ్రామానికి చేరుకుంది. తాజాగా ఆవుపై దాడి చేయడంతో స్థానికుల్లో మళ్ళీ భయాందోళన నెలకొంది.