Cotton Farmers Protest: కుమురం భీం ఆసిఫాబాద్ లో పత్తిరైతులు ఆందోళ చేపట్టారు. పత్తి గిట్టుబాటు ధర 15 వేల రూపాయలు కల్పించాలని కోరుతూ.. రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఆసిఫాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ధర్నాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న పత్తి రైతులు వేల సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతుల సమస్యలు పరిష్కారమైతాయని భావించామని కానీ రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. రైతు సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 



రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రోడ్డెక్కినా.. జిల్లా కలెక్టర్ తమ వద్దకు వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పలేని దీన స్థితిలో ఉన్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాన రహదారి గుండా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వాలు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోతే రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఇది ఆరంభం మాత్రమే అని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలంతా ఏ విధంగా పోరాడారో అదే విధంగా రైతులు వారి కుటుంబ సభ్యులతో రోడ్డుపై వంటావార్పులతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలుపుతామని వివరించారు. పత్తికి రూ.15,000 రూపాయల గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన తెలుసుకొని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నిరసన చేపట్టిన రైతుల వద్దకు వచ్చి పత్తి ధర గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొంత సంయమనం పాటించాలన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో ధర గురించి ప్రస్తావన చేసి న్యాయం చేస్తామన్నారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.


కరీంనగర్ లో పత్తి అమ్మాలా వద్దాని రైతుల సందిగ్ధత


మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి రైతులు, వ్యాపారులు డైలమాలో పడిపోయారు. గతంతో పోలిస్తే ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో అమ్మకం కొనుగోళ్ల విషయంలో తికమక పడుతున్నారు. తెల్ల బంగారం ధర ఇంకా పెరుగుతుందనే ఆశతో రైతులు పంటను అమ్మకుండా ఇళ్లల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. దీంతో పత్తి లేక జిన్నింగ్ మిల్లులు వెలవెలబోతున్నాయి. గత ఏడాది జనవరిలో క్వింటాల్ పత్తి కి రూ.12,000, ఫిబ్రవరిలో రూ.14,000 వరకు బహిరంగ మార్కెట్లో ధర పలికింది. ఈసారి కూడా అదే విధంగా రేటు వస్తుందన్న ఆశతో పత్తి దిగుబడులను విక్రయించడం లేదు. డబ్బులు అవసరం ఉన్నవారు కూడా కొంతే అమ్ముతున్నారు తప్ప.. పూర్తి స్థాయిలో అమ్మడం లేదు. జిల్లాలో ఈ సీజన్లో భారత పత్తి సంస్థ (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ జిన్నింగ్ మిల్లులను నిర్ణయించినప్పటికీ ఓపెన్ మార్కెట్ లోనే ఎక్కువ ధర పలకడంతో (సీసీఐ)కొనుగోలు ప్రారంభం కాలేదు.