Adilabad News : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహిత క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు వివాహమై ఏడేళ్లు అయింది. అత్తింటి వారితో చిన్నచిన్న సమస్యలు, మనస్పర్థలున్నట్లు తెలుస్తోంది. ఏం జరిగిందో ఏమో ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. చనిపోవాలని నిర్ణయించుకుంది. తాను మరణిస్తూ అభంశుభం ఎరుగని ఐదేళ్లు కూడా నిండని బిడ్డలనూ వెంట తీసుకెళ్లింది. ఈ విషాద ఘటన అందరిని కలచివేసింది.
కుటుంబ కలహాలతో
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన వేదశ్రీ (23)కు, ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్ తో 2015లో వివాహమైంది. ప్రశాంత్ ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ప్రజ్ఞ(5), వెన్నెల (3). ఇచ్చోడలో అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. భర్త యథావిధిగా ఉద్యోగానికి వెళ్లగా, ఇంట్లోనే ఉన్న వేదశ్రీ గురువారం సాయంత్రం కుమార్తెలను వెంటబెట్టుకుని వంట గదిలోకి వెళ్లింది. పిల్లలతోపాటు తనపైనా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇంటి లోపలి నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు హుటాహుటిన వచ్చి తలుపులు పగలగొట్టారు. తల్లీబిడ్డలు మంటల్లో కాలిపోతున్నట్టు గుర్తించి మంటలు ఆర్పారు. అప్పటికే వేదశ్రీ మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న చిన్నారులను అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తొలుత ప్రజ్ఞ, రెండు గంటల తర్వాత వెన్నెల మరణించారు. వేదశ్రీకి, అత్తింటి వారికి మధ్య మనస్పర్దలున్నట్టు, ఈ క్రమంలోనే వేరుకాపురం పెట్టినట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సివిల్స్ అభ్యర్థి అనుమానాస్పద మృతి!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని రాయల్ విల్లా కాలనీలో విషాదం చోటు చేసుకుంది. 27 ఏళ్ల సివిల్స్ అభ్యర్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లోనే ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన 27 ఏళ్ల పూజిత సివిల్స్ కు ప్రిపేర్ అవుతోంది. శంషాబాద్ లోని అద్దె గదిలో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె అద్దె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చున్నీతో ఇంట్లోని కిటికీకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించింది. తీవ్రంగా వాసన వస్తుండటంతో స్థానికులు వెళ్లి చూడగా.. పూజిత చనిపోయి కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ముందుగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండడం, తీవ్రంగా వాసన వస్తుంతడటంతో పూజిత కనీసం మూడు రోజుల కిందట చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
అతనే కారణం!
పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న పూజిత తల్లిదండ్రులు.. తమ కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహమ్మద్ అలీ అనే వ్యక్తి పూజితతో సన్నిహితంగా మెలిగేవాడని.. అతనే తమ కూతురు మరణానికి కారణం అంటూ పూజిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతురు కలెక్టర్ అయి సమాజ సేవ చేస్తుందనుకుంటే.. ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఏంటంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.