Indian Auto Stocks: ఇండియన్‌ ఆటోమొబైల్ స్టాక్స్‌ ప్రపంచ స్థాయి ఘనత సాధించాయి. స్టాక్ రిటర్న్‌ల ఆధారంగా... టాప్ 10 గ్లోబల్ ఆటోమేకర్స్‌ జాబితాలో, ఏకంగా 6 ఇండియన్‌ కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. 


పాండమిక్ కారణంగా ఏర్పడిన అంతరాయాలు 2022లో క్రమంగా తగ్గిపోవడం, డిమాండ్ పెరగడం, సరఫరాలు సాధారణ స్థాయికి చేరడం వంటి పరిస్థితుల నుంచి ఈ కంపెనీలు లబ్ధి పొందాయి. 2022 సంవత్సరంలో ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్‌ అందించాయి.


ఇండియన్‌ కంపెనీలే బెస్ట్‌
ప్రపంచవ్యాప్తంగా బిలియన్‌ డాలర్ల కంటే కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న 46 ఆటో కంపెనీలను ఈ లిస్ట్‌ కోసం ఎంపిక చేశారు. ఈ 46 కంపెనీల్లో 12 మాత్రమే 2022లో పెట్టుబడిదారులకు లాభాలు అందించాయి. ఈ డజను కంపెనీల్లోనూ సగం భారతీయ సంస్థలే. 


బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం... ఫోర్డ్‌కు చెందిన టర్కిష్ యూనిట్ ఫోర్డ్ ఒటోమోటివ్ సనాయి (Ford Otomotiv Sanayi) 106% రాబడిని అందించి, టాప్‌ 1 ర్యాంక్‌ దక్కించుకుంది. దీని తర్వాత... TVS మోటార్ కంపెనీ (TVS Motor Company) 72% స్టాక్ రిటర్న్‌తో సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. మహీంద్రా & మహీంద్రా (M&M), ఐషర్ మోటార్స్ (Eicher Motors) వరుసగా 50%, 23% రాబడితో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.


మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India‌) 13%, బజాజ్‌ ఆటో (Bajaj Auto) 10%, హీరో మోటోకార్ప్‌ (Hero Motocorp) 9% శాతం రిటర్న్స్‌తో వరుసగా 6, 7, 8 ర్యాంకులు సంపాదించాయి.


2022లో, న్యూ-ఏజ్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ కంపెనీలు లాభాలను సంపాదించడంలో విఫలమయ్యాయి. దీంతో, ఈ లిస్ట్‌లో సాంప్రదాయ వాహన తయారీ కంపెనీలు చోటు సంపాదించాయి. టెస్లా, రివియన్ ఆటోమోటివ్, ఎక్స్‌పెంగ్, నియో వంటి EV తయారీ ఎంటిటీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 2022లో 60 నుంచి 80% వరకు తగ్గిపోయింది. టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ 2021లో 1 ట్రిలియన్ డాలర్లు దాటింది, 2022 చివరి నాటికి $355 బిలియన్లకు పడిపోయింది.


ఆకర్షిస్తున్న భారతీయ EV ప్రాజెక్ట్‌లు
ప్రపంచవ్యాప్తంగా, ఐదు ప్రధాన ప్యూర్-ప్లే EV కంపెనీలు 2021 నవంబర్‌లోని గరిష్ట స్థాయి నుంచి దాదాపు $800 బిలియన్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. వీటికి భిన్నంగా... భారతీయ కంపెనీల EV ప్రాజెక్ట్‌లు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు.... TVS మోటార్ దాని EV ప్రొడక్ట్స్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. రాబోయే 12-15 నెలల్లో TVS మోటార్‌ నుంచి ఐదు కొత్త EV వెహికల్స్‌ రాబోతున్నాయి, FY25లో EV వాల్యూమ్ మూడు లక్షలకు చేరుతుందని ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు.


FY27 నాటికి, తన మొత్తం అమ్మకాల్లో EVల వాటా 20 నుంచి 30%కి చేరుతుందని M&M అంచనా వేస్తోంది. బోర్న్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ (Born Electric Vehicles) ఉత్పత్తి కోసం పుణెలోని కొత్త EV ఫ్లాంట్‌లో, రాబోయే 7-8 ఏళ్లలో రూ. 10,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని ఈ కంపెనీ యోచిస్తోంది. బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (British International Investment fund) కూడా M&Mతో చేతులు కలిపింది, ఈ EV యూనిట్‌లో రూ. 1,925 కోట్లు పెట్టుబడి పెడుతుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.