Kalyana Lakshmi Scheme In Telangana: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అసలు విషయం ఏమిటంటే.. సామాన్యురాలిగా అందరిలాగానే చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు తల్లీ వెడ్మ భీంబాయి హాజరయ్యారు. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు మంగళవారం నాడు మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అయితే తన కొడుకు ఎమ్మెల్యే బొజ్జు రాక కోసం అందరితో కలిసి గంటసేపు వేచి ఉన్నారు భీంబాయి. అప్పటి వరకు తనతో కూర్చున్న మహిళలకు ఆమె ఎవరో తెలియదు. కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే స్వయంగా ఈమె ఎవరో మీకు తెలుసా..? అని ప్రజల మధ్య కూర్చున్న తల్లి గురించి అడుగుతు.. ఈమె నా కన్న తల్లి.. ఇటీవల మా చెల్లెలకు పెళ్లి కావడంతో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ.లక్షా 116 మంజూరు కావడంతో ఇక్కడికి వచ్చింది. అందరితో సహా సామాన్యురాలిగా కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకోవడానికి వచ్చిందంటూ ఎమ్మెల్యే ప్రజలకు పరిచయం చేయడంతో అందరు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
ఎమ్మెల్యే తల్లి భీంబాయినీ అందరు ఆసక్తిగా చూస్తూ మురిసిపోయారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలోనూ ఫుల్ గా వైరల్ అవుతుంది. అందరిలా సాధారణ వ్యక్తిలా ఎమ్మెల్యే ఉన్న తీరును.. అలాగే ఎమ్మెల్యే తల్లీ సామాన్యరాలుగా వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది.
తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే పథకం కళ్యాణలక్ష్మి పథకం. తెలంగాణ ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకం నేటికి కొనసాగుతోంది. 2017, మార్చి 13న ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్ లో ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుండి రూ.75,116 లకు పెంచారు. 2018, మార్చి 19న రూ.1,00,116 కు పెంచి కొనసాగిస్తున్నారు. దివ్యాంగ ఆడబిడ్డలకు సైతం రూ.1,25,016 అందజేస్తున్నారు.