Telangana Weather News | నిజామాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో పలు జిల్లాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ సహాలు ఉత్తర తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలతో రెడ్ అలర్ట్ జారీ అయింది. వరద నీటితో పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోగా, కొన్నిచోట్ల ప్రధాన రహదారులపై సైతం రాకపోకలకు అంతరాయం కలిగింది.
అత్యవసరమైతే తప్పా ఇండ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు సూచించారు. కేవలం 12 గంటల్లోనే మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు 400 మి.మీ, 300 మి.మీకు పైగా వర్షపాతం నమోదు కావడం వర్ష తీవ్రతను తెలుపుతుంది. కామారెడ్డిలోని జీఆర్ కాలనీ మొత్తం వరద నీటితో నిండిపోయింది. కామారెడ్డిలోని భిక్నూర్ టోల్ ప్లాజా దగ్గర NH 44 బ్లాక్ అయింది. కామారెడ్డి వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.
కేవలం 12 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు- రాజంపేట 423 మిల్లీమీటర్లు- రామాయణపేట 316.3 మిల్లీమీటర్లు- భిక్నూర్ 299 మిల్లీమీటర్లు- నర్సింగి శివనూర్ 289.4 మిల్లీమీటర్లు- హవేలింగపూర్ 287 మిల్లీమీటర్లు- లక్ష్మీపూర్ 253.3 మిల్లీమీటర్లు- కామారెడ్డి పట్టణం 236 మిల్లీమీటర్లు
కామారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సంకామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో భారీ వర్షాలతో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్లారెడ్డి మండలంలో కురిసిన భారీ వర్షాల వల్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. నిజాంసాగర్ మండలం లక్ష్మాపూర్ గ్రామం సమీపంలోని బోగ్గుగుదిసే వాగులో 10 మంది కూలీలు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారు సమీపంలోని నీటి ట్యాంక్‌పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కామారెడ్డి– ఎల్లారెడ్డి ప్రధాన రహదారి కుంగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లా పరిపాలన అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అయితే వాగులో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
కలెక్టర్‌కు ఫోన్ చేసి ఆరా తీసిన కేంద్ర మంత్రి బండి సంజయ్భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాలు నీట మునడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట ఘటనపై కేంద్ర మంత్రి కలెక్టర్ కు ఫోన్ చేశారు. ప్రమాద బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉందని బండి సంజయ్ చెప్పారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో బండి సంజయ్ మాట్లాడారు. ఎల్లారెడ్డిలో తక్షణమే సాయం అందించాలని ఎన్డీఆర్ఎఫ్ ను ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకుని సహాయ చర్యల్లో నిమగ్నమవ్వాలని సూచించారు.
భారీ వర్షాలు కురుస్తుండటంతో అప్పర్ మానేరు డ్యామ్ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో చుట్టుపక్కల ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. చుట్టుపక్కల అన్ని రోడ్లు వరదతో మూసివేశారు. ఈవైపు రాకూడదని ప్రజలకు సూచించారు.