Heavy Rains In Telangana News Updates | హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన భవనాల్లో నివసిస్తున్నవారిని వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించిన ఆయన, వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వల్ల భక్తులకు ప్రమాదం కలగకుండా ట్రాన్స్‌కో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

రాకపోకలను తాత్కాలికంగా నిషేధించాలని సూచన

హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లోని కాజ్‌వేలు, కల్వర్టులు ప్రమాదకరంగా మారవచ్చని, వాటిపై రాకపోకలను తాత్కాలికంగా నిషేధించాలని సూచించారు. పలుచోట్ల వరద నీటికి రోడ్డు మార్గం దెబ్బతింది. కొన్నిచోట్ల వరద ప్రవాహానికి బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద పరిస్థితి భయానకంగా మారింది.

చెరువులు, కుంటలు చెరువు గండ్లు పడే అవకాశం ఉన్నందున, నీటి పారుదల శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, మునిసిపల్‌, పురపాలక, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అలాగే, ఆరోగ్యశాఖ తరఫున అవసరమైన మందులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని, అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

 

మెదక్, సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాలకు భీకర వరద హెచ్చరిక

కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అనేక ప్రాంతాలలో మంగళవారం రాత్రి 12 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఏకంగా 300 మిల్లీమీటర్లకు పైగా అతి తీవ్ర వర్షపాతం నమోదు అయింది. ఈ జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ అయిందని ఈ మూడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ (ఆకస్మిక వరద) హెచ్చరిక జారీ చేసినట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని సూచించారు.

జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల, నిర్మల్ ఖమ్మం, భద్రాద్రి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లోనూ పలుచోట్ల నిరంతరం మోస్తరు వర్షాలు కొనసాగుతాయి. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.