Whatsapp Account Suspension | ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ కోట్లాది మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు WhatsAppని ఉపయోగిస్తున్నారు. సందేశాలతో పాటు, ఈ యాప్ ఇప్పుడు కాలింగ్, డాక్యుమెంట్ షేరింగ్, అనేక ఇతర పనుల కోసం కూడా వినియోగిస్తున్నారు. వీటన్నింటినీ నిర్వహించడానికి, WhatsApp అనేక కఠినమైన మార్గదర్శకాలు రూపొందించింది. ఈ నియమాలను ఉల్లంఘిస్తే వినియోగదారు ఖాతా సస్పెండ్ చేయవచ్చు. చాలా సార్లు ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేస్తారు, ఆ తర్వాత ఆ ఖాతా నుండి మెసేజ్లు పంపలేరు. WhatsAppలో ఈ పనులు చేస్తే ఖాతా సస్పెండ్ అయ్యే ప్రమాదం ఉంది.

అనధికారిక యాప్‌లను ఉపయోగించడం

చాలా మంది WhatsApp అధికారిక యాప్‌లకు బదులుగా WhatsApp Plus, GBWhatsApp వంటి అనధికారిక యాప్‌లను ఉపయోగిస్తారు. వాటిలో కొన్ని ఎక్కువ ఫీచర్లు ఉన్నప్పటికీ, వాటిని నిరంతరం ఉపయోగించడం వల్ల WhatsApp ఖాతా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది.

చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను షేర్ చేయడం

WhatsApp ద్వారా ఏదైనా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను షేర్ చేయడం లాంటి నియమాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి ఈ యాప్ ద్వారా తప్పుడు లేదా రెచ్చగొట్టే సమాచారం, అశ్లీల ఫొటోలు, వీడియోలు లాంటి విషయాలు, మాల్వేర్‌ను షేర్ చేస్తే, అతని ఖాతాను సస్పెండ్ చేయవచ్చు. అటువంటి కంటెంట్ రిపోర్టులను తీవ్రంగా పరిగణిస్తారు.

స్పామ్ మెసేజింగ్

చాలా మంది WhatsAppలో ప్రమోషన్ లేదా ఇతర పనుల కోసం బల్క్ మెసేజింగ్ చేస్తారు. WhatsApp దీనిని అనుమతించదు. ఒక వ్యక్తి స్పామ్ లేదా బల్క్ సందేశాలను పంపితే, ఈ యాప్ దానిని గుర్తిస్తుంది. కొంతకాలం తర్వాత ఖాతాను సస్పెండ్ చేస్తారు.

బెదిరింపు లేదా వేధింపులు

WhatsApp సురక్షితమైన సంభాషణలు, వీడియో, మెస్సేజ్ షేరింగ్ కోసం తీసుకొచ్చిన సోషల్ మీడియా. ఒక యూజర్ వాట్సాప్ ద్వారా ద్వేషపూరిత ప్రసంగం, నిఘా లేదా మరొక వినియోగదారుని వేధిస్తే, అతని ఖాతాను సస్పెండ్ చేయవచ్చు. ఒక వినియోగదారుడు అటువంటి సందేశాన్ని రిపోర్ట్ చేస్తే, చర్య తీసుకుని ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేయవచ్చు.