Ponguleti Srinivas Reddy | హైద‌రాబాద్: తాము తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా సాదా బైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. సాదాబైనామాల‌పై ఉన్న‌ స్టేను రాష్ట్ర హైకోర్టు మంగళవారం నాడు తొలగించిందన్నారు. ఈ తీర్పు లక్షలాది మంది పేద ప్రజల కలలను సాకారం చేస్తుందని పేర్కొన్నారు. సాదా బైనామాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు.

గత ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించింది. కానీ 2020 ఆర్ ఓ ఆర్ చట్టంలో సాదా బైనామాల దరఖాస్తుల పరిష్కారానికి మార్గం చూపించలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు.  ఫలితంగా 9.26 లక్షల దరఖాస్తులు పరిష్కారం కాలేదని, దీనిపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. సాదా బైనామాల దరఖాస్తులను పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో తమ ప్రభుత్వం నిరంతరం హైకోర్టులో కేసుకు ముగింపు లభించేలా కృషి చేసిందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఈ సమస్యకు పరిష్కారం  చూపించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టంలో  స్పష్టమైన నిబంధనలను పొందుపరిచిందని తెలిపారు. సాదా బైనామాల ద‌ర‌ఖాస్తుల‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తామ‌ని మంగళవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీటి పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేయడం జరిగిందన్నారు.

గ‌త ప్ర‌భుత్వం అక్ర‌మంగా తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల సమయంలో ఇచ్చిన హామీ మేర‌కు బంగాళాఖాతంలో క‌లిపేశామ‌ని, దేశంలోని 18 రాష్ట్రాల‌లో అధ్య‌య‌నం చేసి భూభార‌తి -2025 చ‌ట్టాన్ని రూపొందించామని తెలిపారు. రోల్ మోడ‌ల్‌గా నిలిచిన ఈ భూభార‌తి చ‌ట్టం మేర‌కు రైత‌న్న‌ల , ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు స‌ద‌స్సులు నిర్వ‌హించ‌గా 8.60 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని తెల‌పారు. ప్రతి సాదా బైనామా దరఖాస్తుకు పరిష్కారం చూపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తుందని అన్నారు.

సాదాబైనామా అంటే ఏంటి..తెల్ల కాగితాలపై భూమి కొనుగోళ్లకు సంబంధించి రాసుకున్న ఒప్పందాలను సాదాబైనామా అని అంటారు. సాదాబైనామాల‌ క్రమబద్ధీకరణపై ఉన్న స్టేను హైకోర్టు తొలగించింది. సాదాబైనామా రైతులకు 13బీ ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి హైకోర్టు అనుమతించింది. ఆర్వోఆర్ 2020 స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్వోఆర్ 2025 భూ భారతి చట్టం తీసుకొచ్చింది. ఇందులోని సెక్షన్ 6 ద్వారా సాదాబైనామాల క్రమబద్ధీకరణ చేపట్టనున్నారు. విచారణాధికారిగా ఆర్డీవో ఉంటారు. క్రమబద్ధీకరణ జరిగితే రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు వస్తాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి సైతం పెద్ద ఎత్తున రాబడి వస్తుంది.