Ekavimsati Patra Puja: వినాయక పూజలో భాగంగా మార్కెట్ల నిండా పత్రి కనిపిస్తుంది. కట్టలు కట్టి అమ్మేస్తుంటారు. కానీ వాటిలో పూజకోసం వినియోగించే పత్రి ఎన్ని ఉంటాయో తెలియదు. వాటిలో సగానికి పైగా పిచ్చి మొక్కలే ఉంటాయ్. రోడ్డుపక్కన కనిపించే గడ్డి, క్రోటన్ మొక్కల్ని కూడా పత్రిలో కలిపేసి అమ్మేస్తున్నారు. రకానికి ఓ ఆకు ఉన్నా పర్వాలేదు కానీ..పిచ్చి మొక్కలు కొనుగోలు చేయొద్దు.. అనవసర చెత్తను పూజలో చేర్చొద్దు.

పూజలో ఉండాల్సిన పత్రి 21 - అవేంటి? వాటి ఔషధ గుణాలేంటి? 

పూజలో వినియోగించే పత్రికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. ఈ ఆకులు ఆయుర్వేదంలో వివిధ అనారోగ్య సమస్యలకు ఉపయోగపడతాయి.

మాచీ పత్రం : చర్మ వ్యాధులు, జ్వరం, అజీర్ణం, క్రిమి సంబంధిత వ్యాధులు,  అపస్మారం నివారణకు ఉపయోగపడుతుంది. ఈ ఆకుల సుగంధం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

దూర్వా పత్రం: క్రిమి సంహారిణి, అంటు వ్యాధుల నివారణ, చర్మ రోగాలకు ఉపయోగపడుతుంది. గరిక రసం వాంతులు, విరేచనాలను తగ్గిస్తుంది.

అపామార్గ పత్రం : దంత ధావనం, పిప్పి పన్ను, చెవి నొప్పి, రక్తస్రావం, మొలలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్రపిండాలలో రాళ్ల నివారణకు ఉపయోగపడుతుంది. తేనెటీగ కుట్టినప్పుడు ఈ ఆకు రసం ఉపశమనం కలిగిస్తుంది.

బృహతీ పత్రం: ఆయాసం, దగ్గు, మలబద్ధకం, అతివిరేచనాలు తగ్గిస్తుంది. బాలింతలకు ఈ ఆకు ఉపయోగకరం.

దత్తూర పత్రం : ఊపిరితిత్తులను వ్యాకోచింపజేసి ఉబ్బసం తగ్గిస్తుంది. విషరోగ పుండ్లను నయం చేస్తుంది, కానీ జాగ్రత్తగా ఉపయోగించాలి.

తులసీ పత్రం : జలుబు, దగ్గు, జ్వరం, చెవి నొప్పి, దంత నొప్పి, చుండ్రు, అతిసారం, గాయాల నివారణకు ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తేలు కుట్టినప్పుడు విషాన్ని తగ్గిస్తుంది.

బిల్వ పత్రం: మధుమేహం, అతిసారం, విష నివారణకు ఉపయోగపడుతుంది. ఆకుల రసం చక్కెర వ్యాధి నివారణకు, పండ్ల గుజ్జు జీర్ణక్రియకు, వేర్ల కషాయం టైఫాయిడ్ జ్వరానికి ఉపయోగపడుతుంది.

బదరీ పత్రం: జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.

చూత పత్రం: దంత వ్యాధులు, నోటి పూత, వికారం, రక్తస్రావం నివారణకు ఉపయోగపడుతుంది. క్రిమి కీటకాల నివారణకు దోహదపడుతుంది.

కరవీర పత్రం: గన్నేరు చెట్టు నుంచి వచ్చే గాలి రోగాల నివారణకు సహాయపడుతుంది. చర్మ వ్యాధులు, గాయాలకు ఉపయోగపడుతుంది, కానీ జాగ్రత్తగా వాడాలి.

మరువక పత్రం : సుగంధభరితమైన ఈ ఆకు జలుబు, దగ్గు,  శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

శమీ పత్రం : రక్త శుద్ధికి, జ్వరం, చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. శరీరంలో వాపులను తగ్గిస్తుంది.

విష్ణుక్రాంత పత్రం: మేధస్సును పెంచుతుంది, జ్వరం,  నరాల సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

సింధువార పత్రం : వాత సంబంధిత నొప్పులు, శరీర వాపులు, కాలరా, జ్వరం, కాలేయ సమస్యలు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది.

అశ్వత్థ పత్రం : రక్త శుద్ధి, చర్మ వ్యాధులు,  జీర్ణ సమస్యలకు ఉపయోగపడుతుంది.

దాడిమీ పత్రం : జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తస్రావం, అతిసారం నివారణకు ఉపయోగపడుతుంది.

జాజి పత్రం : చర్మ రోగాలు, కండ్లకలక, కడుపులో నులిపురుగులు, కామెర్ల నివారణకు ఉపయోగపడుతుంది.

అర్జున పత్రం: హృదయ సంబంధిత వ్యాధులు, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.

దేవదారు పత్రం  : శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరం, చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. దీని చెక్క సహజమైన విగ్రహాల తయారీకి ఉపయోగపడుతుంది.

గండలీ పత్రం: గడ్డి జాతి మొక్కగా, ఇది జ్వరం, చర్మ సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది.

అర్క పత్రం : రక్త శుద్ధి, థైరాయిడ్ సమస్యలు, దగ్గు, జలుబు నివారణకు ఉపయోగపడుతుంది. జిల్లేడు ఆకులు, పూలు, వేర్లు, పాలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి, కానీ జిల్లేడు పాలు కళ్ళలో పడితే హాని కలిగిస్తాయి కాబట్టి జాగ్రత్తగా వాడాలి.

గమనిక: ఈ ఆకులను ఔషధంగా ఉపయోగించే ముందు ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం మంచిది,  కొన్ని ఆకులు తగిన జాగ్రత్తలు లేకుండా ఉపయోగిస్తే హాని కలిగించవచ్చు. 

పర్యావరణ ప్రయోజనం: ఈ 21 రకాల ఆకులు పూజ సమయంలో సుగంధాన్ని వెదజల్లడమే కాకుండా, ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి, సూక్ష్మ క్రిములను నశింపజేస్తాయి. పూజ తర్వాత వీటిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు శుద్ధి అవుతుంది

వినాయక చవితి పూజా విధానం - పసుపు గణపతి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

పసుపు గణపతి పూజ తర్వాత మీరు తీసుకొచ్చిన గణేష్ విగ్రహానికి పూజ చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

వినాయక చవితి రోజు చదవాల్సిన కథలు సంస్కృతంలో కాకుండా మీకు అర్థమయ్యేలా చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి