Jangubai Jatara :  పుష్యమాసం వచ్చిందంటె చాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాలు డోలు డప్పు వాయిద్యాలతో సందడి వాతావరణంతో... ఆదివాసీలు నియమనిష్టలతో ప్రత్యేక పూజలు చేస్తు తమ దైవాలను కొలుస్తుంటారు. ఆదివాసీల‌కు ప్రకృతికి విడ‌దీయ‌రాని బంధం.. వారి అల‌వాట్లు, ఆచారాలు ప్రకృతితోనే ముడిప‌డి ఉంటాయి. కొండా కోన‌ల్లో జీవ‌నం .. అడ‌వే జీవ‌నాధారం.. వారి వేష‌ధార‌ణ‌, పూజ‌లు, పండుగ‌లు, జాత‌ర‌లు ఇలా ప్రతి అంశంలోనూ వీరి శైలి భిన్నంగా ఉంటుంది. ప్రతి నెలా ఒక్కోమాసంలో ఒక్కో పూజా కార్యక్రమం, వారికి అనుగుణంగా ప్రత్యేక నియమ నిబంధనలు. ఆదివాసీలు వారి తెగ‌ల రూపంలో జీవిస్తున్న గోండుల ప్రత్యేక‌త‌లు అన్నీ ఇన్నీ కావు.. వారి సంస్కృతి, సంప్రదాయాలు ఆశ్చర్యం క‌లిగించేవే.. ముఖ్యంగా పుస్యమాసంలో ఆదివాసీలు భక్తి శ్రద్దలతో తమ ఆరాద్య దైవమైన జంగుబాయిని ప్రత్యేకంగా కాలినడకన వెల్తు కుటుంబ సమేతంగా గ్రామస్తులంతా కలిసి ఎడ్లబండ్లపై వెళ్ళి దర్శించుకుంటారు. భారతదేశంలోని ఆదివాసీలకు ఆది దైవం జంగుబాయి. జంగుబాయి జాత‌ర‌ ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా కొనసాగుతోంది. తెలంగాణ మహరాష్ట్ర సరహద్దుల్లోని అడవుల్లో ఉన్న ఆదివాసీల ఆరాద్య దైవం జంగుబాయి జాతర పై "abp దేశం" ప్రత్యేక కథనం.


పచ్చని అడవి అంతర్రాష్ట్రల సరిహద్దులో గలగలపారే సెలయేరు.. కొంతభూభాగం తెలంగాణ సరిహద్దైతే.. కొంత భూభాగం మహరాష్ట్ర సరిహద్దులోనిది ఈ జంగుబాయి సన్నిధీ. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం కొటాపరందోలి బిడ్ వార్ సమీపంలో తెలంగాణ మహరాష్ట్ర సరిహద్దులో ఉన్న అడవిలో జంగుబాయి పుణ్యక్షేత్రం ఉంది. పుష్యమాసంలో నెల రోజులపాటు ఆదివాసీలు నిమయనుష్టలతో ఉంటు జంగుబాయిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున తరలి వస్తున్నారు.


దేవత అన‌గానే మనమంతా ఓ ఆకారం అని ఊహిస్తాం... కానీ ఇక్కడ ఆదివాసీల దేవ‌తంటే ఒక వెలుగు అంతే.. చీక‌ట్లను పార‌ద్రోలే దీపాన్ని జంగూబాయి దేవ‌త రూపంగా వీరు ఆరాధిస్తారు. దట్టమైన అడవిలో ఓ న‌ది ప‌క్కన ఎత్తైన కొండ మ‌ధ్యలోని గుహ‌ లోప‌ల కాంతులు వెద‌జ‌ల్లే దీప‌మే జంగుబాయి దేవ‌త‌. ఆ దీపం ఉంచిన స్థల‌మే జంగూబాయి మహళ్.. గుహా లోప‌లికి వెళ్లాంటే కొంచం క‌ష్టప‌డి వెళ్లాల్సిందే.. తెలంగాణ‌, మ‌హారాష్ర్ట స‌రిహ‌ద్దులో ఉన్న అట‌వీ ప్రాంతంలో ఉంటుంది ఈ జంగూబాయి పుణ్యక్షేత్రం. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెర‌మెరి మండ‌లంలోని కోటా ప‌రందోళి సమీపంలో ఈ ఆదివాసీల జంగుబాయి పుణ్యక్షేత్రం వెల‌సింది. 




ఈ జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని ద‌ర్శించుకోవ‌డానికి పెద్ద ఎత్తున ఆదివాసీలు త‌ర‌లివ‌స్తున్నారు. మన తెలుగు రాష్ట్రల నుండే కాకుండా మహరాష్ట్ర, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రల నుండి ఆదివాసీలు తరలివచ్చి తమ ఆది దైవమైన జంగూబాయిని దర్శించుకుంటున్నారు.  జంగుబాయి జాతర అంటె.. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు మాత్రమే ఉంటాయిక్కడ‌, ఈ ఎత్తైన కొండల నడుమ ఉన్న నది ప్రాంతాన్ని టొప్లకాస అని అంటారు. జంగుబాయి పుణ్యక్షేత్రానికి వచ్చిన వారు ముందుగా ఈ టొప్లకాస వద్ద నదిలో తమ ఇంటి దైవాలకు పూజలు చేసి స్నానాలు చేయించి, నలుమూలల (నాలుగు దిక్కులు) దండం పెట్టి మొక్కుతారు. తమ ఇంటి దైవాల ప్రతిమలకు స్నానాలు ఆచరించి పూజలు చేస్తారు. డోలు వాయిద్యాల నడుమ పూజలు చేసి పునకాలు విన్యాసాలతో బయలుదేరుతారు. టొప్లకాస నుండి రావుడ్ పేన్ ను దర్శించుకుంటారు. అక్కడ తమ నైవేద్యాలను దైవాల ప్రతిమల గుళ్ళలను పెట్టి మొక్కులు చెల్లించి, అవ్వల్ పేన్ ఆలయంలో పూజలు చేస్తారు. ఈ మూడు చోట్లా పూజలు పూర్తయ్యాకే జంగుబాయిని దర్శించుకుంటారు. 


అవ్వల్ పేన్ పూజ దర్శనం అయ్యాక అక్కడ నుండి జంగుబాయి మహాళ్ వద్దకు చేరుకొని, రాయితాడ్ పేన్ కు పూజలు చేసి జంగుబాయి గుహ‌పైకి ఎక్కి గుహ లోపల జంగుబాయి దీపాన్ని ద‌ర్శించుకుంటారు. ఈ గుహలో ఉన్న దీపమే జంగుబాయి.. పూర్వం ఇక్కడికి జంగుబాయి దీపం రూపంలో వచ్చినట్లు ఆదివాసీలు భావిస్తారు. జంగుబాయి ని దర్శించుకోవడంతోనే ఆదివాసీలకంతా మంచి జరిగిందని, అప్పటి నుండి ఇక్కడ జంగుబాయి జాతర కొనసాగుతుందని ఆదివాసీలు చెబుతున్నారు. ప్రతియేటా పుష్యమాసంలో జంగుబాయికి ప్రత్యేక పూజలు చేయడంతో అంతా మంచి జరుగుతుందని ఆదివాసీల నమ్మకం. జంగుబాయి పూజల అనంతరం అందరు కలిసి తమ తమ కుటుంబాలతో సందడిగా వివిధ రకాల వంటకాలు తయారు చేసి ముందుగా తమ దైవాలకు నైవేద్యం పెట్టి ఆ తరువాత అందరు కలిసి విందు చేస్తారు. స్వచ్చమైన నువ్వుల నూనే ఇప్ప నూనేలతో నైవేద్యం పెట్టాక ఆ నూనెలతోనే మహిళలు వంటకాలు గారేలు, బురేలు అప్పాలు చేస్తారు. ఇవి ఆదివాసీలకు ప్రత్యేకమైనవి. 




ఇదంత ఒక ప్రకృతి వింత‌... చుట్టూ పారే న‌ది. మ‌ధ్యలో ద్వీప‌క‌ల్పం... పూర్వకాలం నుండి ఇది పులులు సహవాసం ఉండే ప్రాంతం... అంత‌టి కీకార‌ణ్యం ఇది. నెల రోజుల పాటు జ‌రిగే ఈ పుస్యమాస పూజ‌ల‌కు మన తెలుగు రాష్ట్రల నుండే కాకుండా పక్కనున్న మ‌హారాష్ర్ట‌, చ‌త్తీస్‌ఘ‌డ్, మధ్యప్రదేశ్ జార్ఖండ్ తదిత‌ర రాష్ట్రల నుండి ఆదివాసీలు వచ్చి జంగుబాయి ని దర్శించుకుంటున్నారు. ఆదివాసీలు ఈ పుస్యమాసంలో కాళ్ళకు చెప్పులు ధరించకుండా, తమ ఇళ్ళలో తప్పా బయట ఏమి తినకుండా నియ‌మ‌నిష్టల‌తో జంగుబాయిని ఆరాదిస్తారు. జంగూబాయి జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తులు ఎన్నో నియ‌మ‌నిష్ట‌లు పాటిస్తారు. పుష్య‌మాసంలో నెలవంక క‌నిపించిన రోజు నుండి పుస్య అమ‌వాస్య వ‌ర‌కు ఆదివాసులు ప‌విత్రమాసంగా భావిస్తారు. తమ ఇల్లు, వాకిలి అంత శుభ్రం చేసి ఆవుపేడ‌తో అలుకు చ‌ల్లి ప‌విత్రంగా ఉంచుకుంటారు. నెలరోజుల పాటు ఆదివాసీలు తప్ప ఎవరిళ్ళలోను కనీసం మంచినీళ్ళు కూడా తాగరు.. నెల రోజుల వరకు  పాద‌రక్షలు ధ‌రించ‌రు. ఇంటి ఆవ‌ర‌ణ‌లో కూడా అవి లేకుండా చూసుకుంటారు. నిషాపాని మ‌ద్యానికి దూరంగా ఉంటారు. జంగుబాయిని కొలిచే భ‌క్తులు బ‌య‌ట భోజ‌నాలు చేయ‌రు. హోట్‌లో భోజ‌నం, తాగునీరు కూడా ముట్టరు. ఇంటివంట‌కే ప‌రిమితం అవుతారు. జంగూబాయి వ‌ద్దకు వ‌చ్చే భ‌క్తులు చాలా మంది కాలిన‌డ‌క‌నే వ‌స్తుంటారు. దూర ప్రాంతాల వారు వాహనాల్లో వస్తుంటారు.
ఈ జంగుబాయి పుణ్యక్షేత్రంలో ముందుగా  ఎనిమిది గోత్రాల వారు క‌టోడాలు ప్రక‌టించిన రోజున నియ‌మ‌నిష్టల‌తో జంగుబాయి సన్నిధికి వెళ్లి రాత్రిపూట దీపారాధ‌న కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక నైవేద్యం స‌మ‌ర్పిస్తారు. అప్పటి నుండి వారు అక్కడే ఉంటూ నిత్యం హాజ‌ర‌య్యే భ‌క్తుల‌కు ముందుండి సంప్రదాయ పూజ‌లు చేయిస్తారు. భ‌క్తులు న‌డుచుకుంటూ వ‌చ్చే స‌మ‌యంలో ఎక్కడైనా ఆగాల్సి వ‌స్తే పూజా సామ‌గ్రి ఉన్న గంప‌ను ఎక్కడ‌ప‌డితే అక్కడ పెట్టకుండా నేల‌పై మూడు రాళ్లను పేర్చి నీటితో శుభ్రం చేసి గో మూత్రం చ‌ల్లిన త‌ర్వాతే అక్కడ ఉంచుతారు. తమ తమ గ్రామాల నుండి సైతం వారి వారి కుటుంబ దైవాలను జంగుబాయి సన్నిధిలోకి తిసుకొచ్చి గంగ స్నానం చేయించి తమ సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహిస్తారు. 


ఆదివాసీ తెగలలోని గొండు, కొలాం, ప్రధాన్, తోటి, మన్నేవార్ ఇతర తెగల వారు వారి వారి సాంప్రదాయ కట్టుబాట్లాననుసరించి వారి దైవాలైన జంగుబాయి, భీమయ్యక్, జంగున్ భుయ్యారీ.. భీం దేవ్.. భౌర్ పేన్, డొల్లార అవ్వల్ పెన్, కావడా పేన్ ఇలా ఒక్కోక్కరికి ఒక్కో దేవతల పెర్ల రూపంలో కొలుస్తుంటారు. వారి డోలు వాయిద్యాలు.. వారి సాంప్రదాయ విన్యాసాలు... దేవతల వద్ద పూనకాలు... నృత్యాలు ఇవన్ని అడవికి ఆదివాసీలకి అనుసందానంగా అద్ధంగా నిలుస్తున్నాయి.




ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు అన్ని ఇన్ని కావు... చెప్పలెనన్నివి.. ఈ జంగుబాయి పుణ్యక్షేత్రంలో ప్రతిచోట ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు చాలా భిన్నంగా స్పష్టంగా క‌నిపిస్తాయి. ఇంత ఆధునిక యుగంలోను కూడా ఆదివాసీలు త‌మ పూర్వకాలం నుండి పాటిస్తువస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను మ‌రిచిపోకుండా అన్ని విధాలుగా త‌మ ఆచార వ్యవహారాలను పాటిస్తున్నారు. రైతులు పండించిన వ‌డ్లను ఇంటి వ‌ద్దనే రోళ్లలో దంచి సేక‌రించిన బియ్యాన్ని పూజ‌లో వాడుతారు. నైవేద్యం కోసం నియ‌మాల‌తో ఉన్న వారే పూరాత‌న ప‌ద్దతుల‌ు (గానుగ)తో తీసిన నువ్వుల నూనె వాడుతారు. జంగుబాయి దీపారాధాన కోసం స్వచ్చమైన నువ్వుల నూనె లేకుంటే ఆముదం నూనె మాత్రమే వాడుతారు. జంగుబాయి వ‌ద్దకు వెళ్లేట‌ప్పుడు కూడా డోలు, స‌న్నాయి. కాలికోం, తుడుం వాయిద్యాలు వాయిస్తూ వెళ‌తారు. 
ఈ వాయిద్యాల‌తోనే జంగుబాయి కొలువైన గుహ‌లోప‌లికి వెల్లి కటోడా దేవారి స‌మ‌క్షంలో వెళ్లి జంగుబాయిని ద‌ర్శించుకుని దీపారాధ‌న చేసి నైవేద్యంతో ప్రత్యేక పూజ‌లు నర్వహిస్తారు. అక్కడి నుంచి వచ్చాక అవ్వల్ పేన్, రావుడ్ పెన్ వ‌ద్ద మేక‌లు, కోళ్లను బ‌లిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వండిన ప్రతి వంటకాన్ని దైవాలకు నైవేద్యం పెట్టాకే స‌హ‌పంక్తి భోజ‌నాలు చేస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరు ఒకరాత్రి ఇక్కడే ఉండి సాంప్రదాయ భక్తి పాట‌లు పాడుతూ జంగుబాయిని ఆరాధిస్తారు. తెల్లవారు జామున ఉద‌యం సంప్రదాయ వాయిద్యాల న‌డుమ నృత్యాలు చేస్తూ సంబురాలు చేసుకుని తమ తమ గమ్య స్థానాలకు తిరిగి వెళతారు. జంగుబాయి జాత‌ర స‌మ‌యంలో దేవ‌త ర‌క్షణ కోసం ఎనిమిది గోత్రాల‌కు సంబంధించిన తెగ‌లు ప‌నిచేస్తాయి.
గోత్రాన్ని బ‌ట్టి ప‌ని విభ‌జ‌న చేసుకుంటూ ముందుకు సాగుతారు. త్రుమం గోత్రం వారు పెద్ద ఇంటి వారు. వీరికి ఆ దేవ‌త ముందు గాధీ పూజ చేసే హ‌క్కు ఉంటుంది. మ‌ర‌ప గోత్రం వారు ప్రధాన పూజారులుగా ఉంటారు. 
కొడప గోత్రం వారు కారోబారీలుగా ఉంటారు. అంటే గ్రామ పంచాయ‌తీ పెద్దగా వ్యవ‌హ‌రిస్తారు. వేట్టి గోత్రం వారు ప‌టేళ్ల లాగా వ్యవ‌హ‌రిస్తారు. స‌లాం గోత్రం వారు దేవ‌త‌కి చిట్టచివ‌రి పూజ నిర్వహిస్తారు. శుద్ధి కార్యక్రమం కూడా వారే నిర్వహిస్తారు. 
హెరేకుమ్ర గోత్రం వారు కూడా కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాయ్‌సిడాం గోత్రం వారు దేవ‌త‌కి జ‌న్నె విడిచిన ప‌శువుల‌ను మేపుతూ వాటి సంఖ్యను పెంచేలా చూసుకుంటారు. ఇది వారి విధి.. మండాడి గోత్రం వారు దేవ‌స్థానానికి వెళ్లి నాలుగు శాఖ‌ల వారికి కండువాలు, శాలువాలు బ‌హుక‌రించాలి. ఈ ఎనిమిది గోత్రాల వారు వారి దేవుళ్ళకు సంభందించి వారిని సార్ పేన్ స‌గ అని కూడా అంటారు. త‌మ విధుల‌ను నిర్వహిస్తూ జంగుబాయి పూజ‌ల‌కు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు.


జంగూబాయికి ఒక ఆకారం లేదు. ఆమె ఒక ప‌విత్ర భావ‌న‌. ఒక పుర‌స్మృతి. ఒక దీవేన‌.. వాస్తవానికి మిగ‌తా జాత‌ర‌ల‌తో పోల్చితే ఈ ఆదివాసీల జంగుబాయి జాత‌ర ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి. మిగ‌తా జాత‌ర‌ల లెక్క‌న ఇక్కడ పెద్దఎత్తున హ‌డావిడి ఉండ‌దు. కానీ న‌మ్మకం, సంప్రదాయాల్లో ఎక్కడా తేడా రాదు. అదే స‌మ‌యంలో నెల రోజుల పాటు నిత్యం ఆదివాసీలు పెద్దఎత్తున ఇక్కడికి వ‌స్తారు. సంప్రదాయ‌బ‌ద్దంగా పూజ‌లు, నృత్యాలు చేసుకుని జంగుబాయికి మొక్కలు చెల్లించుకుని వెళ్లిపోతారు. దట్టమైన అడవి ప్రకృతి అందాల న‌డుమ‌, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల న‌డుమ అద్భుతంగా సాగుతోందీ జంగుబాయి జాత‌ర‌. 
జాతర అంటే అందరిలా జన జాతర కాదు ఆదివాసీల ఆరాధ్యదైవం జంగుబాయి పుణ్యక్షేత్రంలో ఆదివాసీలు ప్రకృతితో మమేకమై ప్రకృతిని పూజిస్తూ పూర్వకాలం నుండి వస్తున్న ఆచారాలను సాంప్రదాయాలను కట్టుబాట్లను పాటిస్తు భక్తి శ్రద్దలతో నియమ నిష్టలతో నెల రోజుల పాటు జంగుబాయికి మొక్కులు చెల్లిస్తున్నారు. అడవిలో ఆనందంగా సంబరంగా జరుగుతోంది జంగుబాయి జాతర.