టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రోజుకోమలుపు తిరుగుతోంది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు.. కొత్త పాత్రధారులు పుట్లుకొస్తున్నారు. ఇప్పుడు ఏకంగా గ్రూప్-1 పేపర్ దేశం దాటినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డి.. న్యూజిలాండ్‌లో ఉంటున్న అతడి బావ ప్రశాంత్‌రెడ్డికి వాట్సాప్‌లో పేపర్‌షేర్ చేసినట్లు విచారణలో తేల్చింది. దీంతో అతడికి నోటీసులు జారీ చేసింది. ప్రశాంత్‌రెడ్డి పరీక్ష రాసి తిరిగి న్యూజిలాండ్ వెళ్లిపోవడంతో వాట్సాప్, మెయిల్ ద్వారా సమాచారం అందించింది. ఐతే సిట్ నోటీసులకు ప్రశాంత్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది. దీంతో లుకౌట్ నోటీసులు ఇష్యూ చేసేందుకు సిట్ అధికారులు చర్యలు ప్రారంభించారు.
అక్కడ ప్రిపరేషన్.. ఇక్కడ పరీక్ష
గ్రూప్–1 పేపర్‌ను రాజశేఖర్‌రెడ్డి న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌రెడ్డికి వాట్సాప్‌లో షేర్ చేసినట్లు సిట్ గుర్తించింది. న్యూజిలాండ్‌లోనే పరీక్షకు ప్రిపేర్ అయిన ప్రశాంత్‌రెడ్డి.. ఇక్కడికొచ్చి పరీక్ష రాశాడు. ప్రశాంత్ ద్వారా మరికొంత మందికి పేపర్ చేరి ఉంటుందని సిట్ అనుమానిస్తోంది. ఇక టీఎస్ పీఎస్సీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న దామెర రమేష్‌కు కూడా రాజశేఖర్ ద్వారానే పేపర్ వెళ్లింది.
ఆరుగురికి క్లీన్ చిట్..
గ్రూప్–1 ప్రిలిమ్స్ రాసిన 26 మంది టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులను ఇప్పటికే సిట్ ప్రశ్నించింది.100కు పైగా మార్కులు వచ్చిన 8 మందిలో షమీమ్, రమేశ్ మినహా మిగితా ఆరుగురు ఉద్యోగులకు పేపర్ లీకేజ్‌తో సంబంధం లేదని గుర్తించారు. ఈ క్రమంలోనే 100కు పైగా మార్కులు వచ్చిన121 మంది అభ్యర్థులను సిట్ విచారిస్తున్నది. ఇందులో 40 మంది విచారణ ఇప్పటికే పూర్తయింది. వీరిలో టీఎస్‌పీఎస్సీ మాజీ ఉద్యోగి సురేశ్ లీకేజీ పేపర్‌తో పరీక్ష రాసినట్లు గుర్తించి అరెస్టు చేశారు. మిగతా వాళ్లకు పేపర్ లీకేజీతో సంబంధం లేకపోవడంతో క్లీన్ చిట్ ఇచ్చారు. టాప్ మార్కులు స్కోర్ చేసిన మరో 80 మందిని విచారిస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, ఆమె భర్త ఢాక్యా నాయక్‌లతో కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరాలను కూడా సిట్సేకరించనుంది.
హోటల్‌లో ఏఈ ఎగ్జామ్‌కు ప్రిపరేషన్..
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రమేశ్, మాజీ టెక్నీషియన్ సురేష్ రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ కీలక వివరాలు వెల్లడించింది.12 మంది నిందితులు 19 మంది సాక్షులతో కూడిన రిమాండ్ రిపోర్ట్‌ను కోర్టుకు అందించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని ఇందులో ప్రధాన సాక్షిగా పేర్కొన్నారు. నిందితుడు ప్రవీణ్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కనం అనురాజ్, రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేస్తున్న హరీష్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. రేణుక, ఆమె భర్త కర్మాన్‌ఘాట్‌లోని ఆర్ స్క్వేర్ హోటల్ రూమ్ నెంబర్107, 108లో నీలేష్, గోపాల్‌ను ఏఈ పరీక్షకు ప్రిపేర్ చేయించారని పేర్కొన్నారు. ఆ తర్వాత 5వ తేదీ ఉదయం సరూర్‌నగర్‌లోని ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్ష రాయించారని వివరించారు. హోటల్‌లో సీసీటీవీ ఫుటేజ్‌ను సిట్ అధికారులు సేకరించారు. హోటల్ ఓనర్ రాఘవేందర్ రెడ్డి, రిసెప్షనిస్టు ర్యాకల ప్రశాంత్‌ను సాక్షులుగా చేర్చారు.
సిట్ అదుపులోకి మరొకరు..
పేపర్ల లీకేజీ కేసులో మరొకరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 24న మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలానికి చేరుకున్న అధికారులు.. ఈజీఎస్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ)గా పని చేస్తున్న అలీపూర్ ప్రశాంత్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. అతన్ని నవాబ్ పేట పోలీస్ స్టేషన్లో సీక్రెట్‌గా విచారిస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి ఏఈఈ పేపర్ కొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గతంలో ఓ హాస్టల్లో ఉండి గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యాడు. ఆ హాస్టల్ లోని కొంతమంది ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. వీరిలోని చాలామంది పేపర్ల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్నారు. అదే గ్రూపులో ప్రశాంత్ రెడ్డి కూడా ఉండడంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.
Also Read:
వాట్సాప్ ద్వారానే 'గ్రూప్-1' ప్రశ్నపత్రాలు చేరవేశారు! కమిషన్ కార్యాలయం నుంచే మొత్తం వ్యవహారం!
టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష పేపర్లు వాట్సాప్ ద్వారానే చేతులు మారినట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో నిందితులు పకడ్బందీగా ప్రశ్నపత్రాలను పంచుకొని లాభపడే ప్రయత్నం చేశారని అధికారులు గుర్తించారు. టీఎస్‌పీఎస్సీ కమిషన్ కార్యాలయం కేంద్రంగానే మొత్తం వ్యవహారం కొనసాగించినట్లు అంచనాకు వచ్చారు. ఈ కేసులో తాజాగా అరెస్టయిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, నలగొప్పుల సురేశ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ దామెర రమేష్ కుమార్ రిమాండ్ రిపోర్టులో ఈమేరకు పలు అంశాలను అధికారులు ప్రస్తావించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..