Girl asking for money for her mother funeral in Nirmal District | విధి రాసిన రాతలో ఓ బాలిక ఒంటరిగా మిగిలిపోయింది. తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే తల్లి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్ తరోడ గ్రామంలో చోటుచేసుకుంది.


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా బెల్ తారోడా గ్రామంలో నివాసం ఉంటున్న గంగామని (36) భర్తతో గత కొన్ని సంవత్సరాల నుంచి వేరుగా ఉంటోంది. ఒంటరిగా కూలీనాలీ చేసుకుని పాప దుర్గను పోషించుకుంటూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపుతుంది. కొన్ని రోజుల కిందట తండ్రి మరణించగా, శనివారం రాత్రి మనస్థాపంతో తల్లి గంగమని ఆత్మహత్య చేసుకుంది. చిన్నతనంలోనే చిన్నారి దుర్గ (11) నాన్న అమ్మలను కోల్పోయింది.






కనీసం అంత్యక్రియలకు కూడా దగ్గరి బంధువులు లేక ఇంటి బయటే ఆ చిన్నారి అనాథగా మిగిలింది. అనాధగా మారిన బాలిక ప్రస్తుతం తల్లి అంత్యక్రియల కోసం డబ్బులకై, ఇంటి ఎదుట ఓ గుడ్డ వేసుకుని అంత్యక్రియలు సహాయార్థం కోసం ఎదురుచూసింది. సోషల్ మీడియాలో సైతం ఈ ఘటన గురించి తెలుసుకున్న కొందరు ఫోన్ పే ద్వారా బాలికకు సహాయం అందించారు.. ఆపై స్థానికుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. 


స్పందించిన కేటీఆర్, బాలికకు సాయం
తల్లితండ్రులను కోల్పోయిన బాలిక సాయం కోసం ఎదురుచూడటంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ బాలికకు తక్షణ సాయం కింద బీఆర్ఎస్ పార్టీ తరపున రూ.10 వేలు అందేలా స్థానిక నాయకత్వం ద్వారా ఏర్పాటు చేశారు. బాలిక ఇంటికి వెళ్లి పదివేల నగదు సాయానికి సంబంధించిన చెక్కును స్థానిక బీఆర్ఎస్ నేతలు అందజేశారు. పాపకు భవిష్యత్తులో అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు పార్టీ నేతలు తెలిపారు.