ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీస్‌నని చెప్పుకుంటూ డబ్బులు వసూల్ చేస్తూ చోరీలకు పాల్పడిన వ్యక్తిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగుండా గ్రామానికి చెందిన కృష్ణ రాథోడ్ కరీంనగర్ జిల్లా కంట్రాపూర్లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు సీపీ నాగరాజు. ఈ నెల 25న నగరంలోని నందివాడలోని దాత్రిక భీమన్న కిరాణాషాపులో గుట్కా అమ్ముతున్నారని స్పెషల్ పార్టీ పోలీస్ పేరుతో బెదిరించి అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ చోరీ చేసి పరారయ్యాడు. దీనిపై మూడో టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు. నకిలీ పోలీస్ అంటూ చెప్పుకుని చోరీలకు పాల్పడుతున్నాడని గ్రహించిన ఖాకీలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా పంబౌలీ రైల్వే క్వార్టర్స్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అరెస్టు చేసి పోలీసులు విచారించారు. దీంతో అసలు నిజాలు బయటపడ్డాయ్. అతని వద్ద ఉన్న బైక్ పేపర్స్ అడగ‌్గా... బైక్ ను ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలంలోని ఇందపల్లి ఎక్స్ రోడ్డు వద్ద దొంగతనం చేసినట్లు కృష్ణ రాథోడ్ ఒప్పుకున్నాడు. దీంతో నకిలీ పోలీస్ బాగోతం బయటపడింది. కృష్ణ రాథోడ్ నుంచి సెల్‌ఫోన్‌, బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.


మరోవైపు నిజామాబాద్ నగరంలో రాత్రుల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆటోనగర్‌లోని సతీష్ నగర్‌కు చెందిన మేకల సుదర్శన్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 6 లక్షల 36 వేల 80 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఈనెల 6న నిజామాబాద్ నగరంలోని రహమాన్ కట్ పీస్ సెంటర్ లో అర్దరాత్రి సమయంలో షట్టర్ ను కట్ చేసి కౌంటర్ నుంచి 9 లక్షల రూపాయలు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. 15 రోజుల క్రితం ఓ ఐస్ క్రీమ్ షాప్ కౌంటర్ నుంచి 15000 రూపాయల నగదు చోరీకి సుదర్శన్ పాల్పడినట్లు తెలిపారు.


కామారెడ్డి జిల్లాలో దొంగల బెడద..


ఎల్లారెడ్డిలో సిగరెట్లు, పాన్ మెటీరియల్, ఇతర వస్తువులను దొంగలు చోరీ చేసినట్లు బాధితుడు అఖిల్ తెలిపారు. సోమవారం రాత్రి పాన్ షాపు మూసివేసి ఇంటికి వెళ్లి ఉదయం వచ్చి చూడగా చోరీ విషయం వెలుగులోకి వచ్చినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భిక్కనూరు మండలంలోని రామేశ్వర్పల్లికి చెందిన పైళ్ల రాజమణి ఇంట్లో మంగళవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి టీవీని చోరీ చేసినట్లు ఎస్సై హైమద్ తెలిపారు. బాధితురాలు వేకువ జామున లేచి తమ ఇంటి ముందు వాకిలి ఊడ్చింది. అనంతరం తన కుమార్తె సువర్ణ హైదరాబాద్ వెళ్లడంతో ఆమె ఇంటి ముందు వాకిలిని ఊడ్చేందుకు వెళ్లి తిరిగి వచ్చేలోగా ఇంట్లో ఉన్న టీవీ కనిపించలేదు. సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించగా అక్కడ ఓ వ్యక్తి బైక్‌పై అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించారు. రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.