Nizamabad News: నిజమాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేట్ ముందు ఫ్యాక్టరీ కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగారు. ముందుగా అమరులైన కార్మికులకు నివాళి అర్పించిన కార్మికులు.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. లే ఆఫ్ విధించి 8 సంవత్సరాలు కావస్తున్నా... కార్మికుల 80 నెలల నుంచి జీతాల బకాయిలు చెల్లించలేదని మండిపడ్డారు. తామంతా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 


దుర్భర స్థితిలో కార్మికుల కుటుంబాలు


ఈ ధర్నాకు బోధన్ బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం చనిపోయిన వారికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు పని లేక పస్తులు ఉంటూ కాలం వెళ్ళదీస్తున్నారని అన్నారు. కొందరు కార్మికులకు అయితే ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు వదులుతున్నారని తెలిపారు. పిల్లలకు ఫీజులు కట్టలేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. 8 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ రోజు ఫ్యాక్టరీ ప్రధాన గేట్ ముందు బైఠాయించి ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మెడపాటి ప్రకాష్ రెడ్డి రేంజల్, టౌన్ ప్రెసిడెంట్ విజయ సంతోష్, మండల్ ప్రెసిడెంట్ బాలరాజు, బీజీపీ సీనియర్ నాయకులు పోశెట్టి సహా తదితరులు పాల్గొన్నారు.


టీడీపీ హయాంలో ప్రైవేటీకరణ


నిజామాబాద్ జిల్లా బోధన్ లో నిజాం కాలంలో ఈ షుగర్ ఫ్యాక్టరీని నిర్మించారు. 1938 లో తొలిసారి క్రషింగ్ ప్రారంభం అయింది. స్వాతంత్య్రం సిద్ధించాక 1950లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం చేజిక్కించుకుంది. అప్పట్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ మంచి లాభాల బాటలో పయనించింది. బొబ్బిలి, సీతానగరం, హిందూపూర్, జహీరాబాద్, మెట్ పల్లి, మిర్యాలగూడ, చాగల్ డిస్లరీ, నాగార్జున సాగర్ లో మిషనరీ డివిజన్, మెదక్‌లో షుగర్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌లో నెఫా చాక్లెట్ కంపెనీ ఏర్పాటు చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం 16 వేల ఎకరాల్లో చెరకు పంట సాగు అయ్యేది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. కార్మికుల పాలిట కల్పవృక్షంలా ఉండేది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పని చేయటం అంటే అనాడు ఓ వరంలా భావించేవారు. కార్మికులు, ఉద్యోగులకు సకల వసతులు ఉండేవి. 2002 లో షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం ప్రారంభించింది. 1400 మంది కార్మికులు పనిచేస్తుండగా.. బలవంతంగా 1200 మందికి వీఆర్ఎస్, సీఆర్ఎస్ ఇచ్చింది. కేవలం 200 మందితో ఫ్యాక్టరీని ప్రైవేటీకరించింది. 


నెరవేరని ప్రభుత్వ హామీ


ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వచ్చాక.. వేతనాలు పెంచకపోవడంతో పాటు సౌకర్యాలు తొలగించారు. రైతులకు డబ్బులు సక్రమంగా ఇవ్వకపోవడంతో రైతులు చెరకు సాగు తగ్గించారు. 2015లో ఫ్యాక్టరీని టేకోవర్ చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. తర్వాత ప్రైవేటు యాజమాన్యం ఉన్నట్టుండి లేఆఫ్ ప్రకటించి పరిశ్రమను మూసేసింది. అలా కార్మికులంతా రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన హామీ ఇంకా నెరవేరలేదు.