CSI Church at Luxettipet Mancherial District: ఆధ్యాత్మిక శోభ.. ప్రకృతి రమణీయతల నడుమ భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తోంది లక్షెట్టిపేటలో వెలసిన సీఎస్ఐ చర్చి (CSI Church at Luxettipet). ఆసియాలోనే అతిపెద్ద చర్చిలలో మెదక్ చర్చి, మంచిర్యాల జిల్లా (Mancherial District)లోని లక్షెట్టిపెట్ చర్చిలు చోటు దక్కించుకున్నాయి. రెండో అతిపెద్ద మహదేవాలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ చర్చి పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది. మంచిర్యాల జిల్లాలోని లక్షేట్టిపెట్ పట్టణ శివారులో 75 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న టేకుల వనంలో విస్తరించి ఉంది ఈ సీఎస్ఐ చర్చి. బ్రిటిష్ కాలంలో రాతి శిలలతో నిర్మించిన ఈ చర్చి తొమ్మిది దశాబ్దాలు దాటినా నేటికి చేక్కు చెదరకుండా అందమైన హంగులతో చూపరులను ఆకట్టుకుంటుంది. క్రిస్మస్ సందర్భంగా లక్షెట్టిపేటలోని చారిత్రక సీఎస్ఐ చర్చిపై abp దేశం ప్రత్యేక కథనం.
మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో ఈ సీఎస్ఐ చర్చి ఉంది. ఇంగ్లాండుకు చెందిన మత ప్రచారకుడు సీజ్ అర్లి తన ప్రచారంలో భాగంగా 1928 ప్రాంతంలో లక్షెట్టిపెట ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొని ప్రజలు తినడానికి తిండిలేక రోగాల బారిన పడ్డారు. అది చూసి వారికి ఉపాధి, వైద్య సౌకర్యాలతో పాటు పిల్లలకు విద్యావకాశం కల్పించే ఉద్దేశంతో చర్చిని, దానికి అనుబందంగా ఆసుపత్రి, పాఠశాల నిర్మాణం చేశారు. అవి స్థానికులకు విద్య, వైద్యం విషయంలో ఆర్థికంగాను ఎంతో ఉపయోగపడిందని స్ధానికులు చెబుతున్నారు. అయితె 1930లో రెవరెండ్ ఈడబ్ల్యూ లాంట్ చర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా 1935లో రెవరెండ్ హెచ్ బర్డ్ హయాంలో చర్చి నిర్మాణం పూర్తయ్యింది. అదే ఏడాది రెవరెండ్ ఫాస్ఫేట్ చర్చికి సీఎస్ఐ చర్చిగా నామకరణం చేసి మహాదేవాలయాన్ని ప్రారంభించారు.
లక్షెట్టిపేట చుట్టుపక్కల గ్రామాలైన చిన్నయ్యగుట్ట, పెద్దయ్యగుట్ట, గూడెంగుట్ట, గువ్వలగుట్టల నుంచి వివిధ రకాల రాళ్లను తెప్పించి నిర్మాణంలో ఉపయోగించారు. ఆకర్షణీయంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇంగ్లండ్ నుంచి రంగురంగుల అద్దాలు తెప్పించారు. చర్చి లోపల బ్రిటిష్ కాలం నాటి ఆనవాళ్లు, ధర్మశాస్త్రంలోని వివిధ రకాల చిహ్నాలు, 18 ఏకశిలలతో పిల్లర్ల నిర్మాణం.. గోతిక్ విధానంలో ఈ చర్చి నిర్మాణం జరిగింది. చర్చి వైశాల్యము 95 ఫీట్లు, చుట్టూ వెడల్పు 45 ఫీట్లు, ప్రాంగణ వైశాల్యము 75 ఫీట్లు, చర్చి చుట్టు 46 దిమ్మెలు గొలుసులతో ఏర్పాటు చేశారు. చర్చి లోపల సుమారుగా 500 మంది ప్రార్థనలు చేసుకునేలా హాలు ఎర్పాటు చేశారు. పూర్తిగా రాళ్లతో నిర్మించిన ఈ చర్చి తొమ్మిది దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అందంగా ఆకర్షిస్తోంది. చుట్టూ పక్కల చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం.. చెట్ల మధ్య ఈ చర్చి ఎంతో అందంగా చూడముచ్చటగా కనిపిస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద చర్చిలలో ఒకటిగా పెరుగాంచింది. ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం, ఈ చర్చిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.
డిసెంబర్ 25న క్రిస్మస్ ను పురస్కరించుకుని చారిత్రక ప్రాధాన్యం గల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చర్చిని విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లోపలి భాగంలో రంగు కాగితాలతో అందంగా అలంకరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్చి నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ఆవరణలో పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర పండగల సందర్బంగా నవంబర్ 25 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు పరిశుద్ద దైవారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నెల రోజులుగా క్రిస్మస్ వేడుకలు
నవంబర్ 25 నుంచి ఈ క్రిస్మస్ వేడుకలు ప్రారంభించారు. డిసెంబర్ 25 క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకలు పెద్దఎత్తున నిర్వహించనున్నారు. ఈ నెల 31న నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే సంబరాలతో ఈ వేడుకలు ముగుస్తాయి. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో పశువుల పాక ఆరాదన, క్రిస్మస్ క్యారల్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సంటా క్లాజ వేషధారణలో క్యారల్స్ లో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ చేస్తున్నామని చర్చి నిర్వహాకులు, సంఘస్తులు చెబుతున్నారు.