KCR Nizamabad Tour: గత కొంత కాలంగా జాతీయ రాజకీయాలు అంటూ మాట్లాడుతూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మరోసారి జాతీయ రాజకీయాల ప్రస్తావన తీసుకువచ్చారు. అయితే ఈ సారి కొంచెం స్ట్రాంగ్ గానే కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడారు. ఇప్పటి వరకు హింట్స్ ఇస్తూ వచ్చిన కేసీఆర్.. ఇప్పుడు ఫుల్ క్లారిటీగా తన దృక్పథం ఏమిటో తేల్చి చెప్పారు. ముక్త్‌ బీజేపీ నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం, ముందుకు సమీకృత కలెక్టరేట్ భవనాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత స్థానిక గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొని జాతీయ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. 


"ఉచితంగా విద్యుత్"


జాతీయ రాజకీయాల్లోకి రావడంపై అజెండా ఫిక్స్ చేసినట్లు కేసీఆర్ వెల్లడించారు. ఈ బహిరంగ సభలోనే ఉచిత విద్యుత్ హామీని సైతం సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశంలో 2024 సంవత్సరం తర్వాత బీజీపీయేతర ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో, ఇతర రాష్ట్రాల్లో పాలన ఎలా ఉందో, పథకాల అమలు, రైతుల స్థితి, పింఛన్లు, ఇతర విషయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలని, పాలనను అర్థం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. 60 ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు ఉచితంగా 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదని కేసీఆర్ తెలిపారు. 


"2024లో బీజేపీ ముక్త్ భారత్"


ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రైతులకు ఉచితాలు ఇవ్వవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నారని, వ్యవసాయ కరెంటు సరఫరాకు మీటర్లు పెట్టాలని రాష్ట్రాలను ఒత్తిడికి గురి చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. అలాంటి బీజేపీని సాగనంపాలని పిలుపునిచ్చారు. 2024లో బీజేపీ ముక్త్ భారత్ ఉండాలని సీఎం కేసీఆర్ మరోసారి పిలుపునిచ్చారు. 


"ఒక్క ప్రాజెక్టైనా నిర్మించారా"


భారత్ కోసం పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలన్న సీఎం... రాష్ట్ర ప్రజలు దీవిస్తే నిజామాబాద్ గడ్డ నుంచే జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలు అవుతుందని స్పష్టం చేశారు. ఈ 8 ఏళ్ల పాలనలో కేంద్రంలోని మోదీ సర్కారు ఒక్క ప్రాజెక్టుగానీ, పరిశ్రమ గానీ నిర్మించిందా అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రశ్నించారు. 


నిజామాబాద్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో సువిశాల విస్తీర్ణంలో కలెక్టరేట్ నిర్మించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో రూ. 60 కోట్ల వ్యయంతో భవనం నిర్మించారు. కలెక్టరేట్ ప్రారంభంతో బైపాస్ రోడ్డు ప్రాంతం సుందరంగా మారింది. ఐదు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా పార్టీ కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభించారు.