Komaram Bheem Asifabad News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్‌లో పెద్దపులి మరోసారి కలకలం రేపింది. సిర్పూర్ మండలంలోని హుడుకిలిలో ఆవు దూడపై దాడి చేసింది. రైతు దంద్రె రావుజీ తన ఇంటి వద్ద కట్టేసి ఉంచిన దూడపై మంగళవారం వేకువజామున పులిదాడి చేసింది. అరుపులు విన్న స్థానికులు కేకలు వేయడంతో పులి అక్కడ నుంచి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.
పులి వెళ్లిపోయిందని స్పాట్‌కు వచ్చిన చూస్తే లేగదూడ తీవ్ర గాయాలతో పడి ఉంది. పులి దాడిలో గాయపడ్డ లేగదూడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. తమ గ్రామంలోకి పెద్దపులి రావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఎటు నుంచి పులి వచ్చి దాడి చేస్తుందో అని కంగారు పడుతున్నారు.
Also Read: సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
పులి దాడి గురించి స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని పులి పాదముద్రలు సేకరించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. పులి వస్తుందని భయపడొద్దని బయటకు వెళ్లాలంటే గుంపులుగా వెళ్లాలంటూ సూచిస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. శబ్దాలు చేస్తూ పనులు చేసుకోవాలన్నారు. సమీప గ్రామాల ప్రజలు ఎవరికైనా పులి కనిపిస్తే తమకు సమాచారం అందించాలన్నారు. పులికి ఎలాంటి హాని చేయొద్దని అది పెద్ద నేరమని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. పశువులను పులి చంపిన, దాడి చేసిన వారికి అటవీశాఖ తరఫున పరిహారం అందజేస్తామన్నారు.
Also Read: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం - లేటుగా వచ్చిందని మందలించిన తల్లి, రైలు కింద పడి బాలిక ఆత్మహత్య