BRS Working President KTR Comments On Congress: 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళి పరిశీలిస్తే నిజామాబాద్‌(Nizamabad) పార్లమెంట్ స్థానంలో బీఆర్‌ఎస్‌(BRS) గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం సన్నాహక సమావేశంలో మాట్లాడిన కేటీఆర్‌... కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చి విజయం సాధించిందని విమర్శించారు. ఇప్పుడు వాటి అమలు చేయలేక సాకులు వెతుకుతోందన్నారు.  


గెలుపు మనదే కానీ


నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళి పరిశీలిస్తే బిఆర్ఎస్ పార్టీ ఓట్ల వారిగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో మొదటి స్థానంలో ఉందన్నారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ కన్నా బీఆర్ఎస్ ముందు వరుసలో ఉందని తెలిపారు. అయితే రాజకీయ పరిణామాలు చూస్తే లోక్‌శభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 


బీఆర్‌ఎస్‌కు ఓటమి కొత్తకాదు


అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల ప్రాతినిధ్యం కోసం గట్టిగా కష్టపడాలన్నారు కేటీఆర్‌. రానున్న ఎన్నికల్లో కొట్లాడితే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. భారత రాష్ట్ర సమితికి ఎన్నికల్లో గెలుపు ఓటములు కొత్త కాదని వివరించారు. 


కాంగ్రెస్ ఇచ్చినవి 420 హామీలు


కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలుగా ఇచ్చిన హామీల సంఖ్య 6 గ్యారంటీలు కాదని 420 హామీలని విమర్శించారు కేటీఆర్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలు హామీలపైన మాట దాటేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. అప్పులు, శ్వేత పత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


సంక్షేమ పథకాలు ఆపేస్తున్నారు


పేద ప్రజల కోసం ఉద్దేశించిన అనే సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు కేటీఆర్. ఇప్పటికే నియోజకవర్గానికి 3,000 మందికి ఇచ్చిన గృహ లక్ష్మి లబ్ధిదారుల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించిందని తెలిపారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పూర్తైన తర్వాత దానిపైన స్పందించడం లేదని వెల్లడించారు. దళిత బంధు, బిసి బంధు, గృహలక్ష్మి ఇలా ఇతర సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తే ఆయా లబ్ధిదారులతో కలిసి బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందన్నారు. పేదలు, దళితులు, బీసీల ప్రయోజనాలకు దెబ్బకొట్టేలా కుట్ర చేస్తే ఊరుకోబోమన్నారు. 


రైతు బంధు వేయకుండా మభ్యపెడుతున్నారు


తమ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు ఎంతమంది రైతులకు డబ్బులు వారి ఖాతాల్లో వేశామో ప్రజలకి అధికారికంగా వివరించే వాళ్లమని తెలిపారు కేటీఆర్. కానీ రైతుబంధు డబ్బులు వేయకుండా, కాంగ్రెస్ ఇప్పుడు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. 


క్యూలైన్‌లో జనాలు నిలబెడుతున్నారు


ఈ సంక్షేమ తెలంగాణలో ప్రభుత్వ పథకానికి ప్రజలను లైన్లలో నిలబెట్టి అందించిందో ప్రజలు ఆలోచించాలన్నారు కేటీఆర్. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇబ్బంది పెట్టేలా లైన్లో నిలబెట్టే దుస్థితికి కాంగ్రెస్ తీసుకువచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త పనితీరును, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. 


ఢిల్లీలో గులాబీ జెండా ఉండాలి


ఎన్నికల్లో పార్టీ పని తీరుపరంగా కూడా కొన్ని మార్పు చేర్పులు అవసరం అన్నారు కేటీఆర్. పార్టీ కార్యకర్తగా ఆకాంక్షలకు అనుగుణంగా కచ్చితంగా మార్చుకుంటామని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది గతంలో ఆయన ఇప్పుడైనా భవిష్యత్తులో అయినా భారత రాష్ట్ర సమితి మాత్రమే అన్నారు.