‘క్యూ న్యూస్’ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్నపై బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ అహ్మద్ షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై మల్లన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆయన్ను మూడు ముక్కలుగా నరికేస్తానని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అగ్రనేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడిన తీన్మార్ మల్లన్నపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తీన్మార్ మల్లన్నను రాష్ట్రం నుంచి తరిమేయాలని ఎమ్మెల్యే షకీల్ డిమాండ్ చేశారు. బోధన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజల కోసం పని చేస్తున్న మంత్రి కేటీఆర్‌పై ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. కేటీఆర్ తనయుడు హిమాన్షు గురించి ఎద్దేవా చేస్తూ మాట్లాడడమేంటని ప్రశ్నించారు. మోసగాళ్లను, చీటర్లను పార్టీలో చేర్చుకుని బీజేపీ ఇదే నేర్పిస్తుందా? అని నిలదీశారు. మరోమారు సీఎం కేసీఆర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తానే ఇంటికొచ్చి కొడతానని షకీల్ హెచ్చరికలు చేశారు.
‘‘తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద చీటర్. రాష్ట్రంలో జర్నలిస్టు పేరుతో అందర్నీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఆయన్ను హెచ్చరిస్తున్నా. నీ పేరు తీన్మార్ మల్లన్న కాదు. మూడు తుకడాలు చేస్తం. ఇంకోసారి కేసీఆర్, కేటీఆర్ ఫ్యామిలీలపై ఏవైనా వ్యాఖ్యలు చేస్తే మూడు ముక్కలుగా నరికి పడేస్తాం. ఒక మంత్రిని ఇంకోసారి నోటికి ఏ మాటలు వస్తే అవి మాట్లాడితే మూడు కాదు.. మూడు వందల ముక్కలు కూడా చేస్తం. జాగ్రత్తగా మాట్లాడు. పోనీ అని ఊరుకుంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నడు. ఇదే క్రమశిక్షణ బీజేపీ నేర్పిస్తుందా? ఇంత చీటర్‌ను బీజేపీ తమ పార్టీలో చేర్పించుకోవడం ఏంటి? కేసీఆర్ మనవడు హిమన్షుపై మాట్లాడిన మాటలు ఏంటి? ఆయనేమైనా నీకు అల్లుడైతడా? ఇంకోసారి పిచ్చి మాటలు మాట్లాడితే నేనే ఇంటికొచ్చి కొట్టిపోతా రాస్కెల్’’ అని బోధన్ ఎమ్మెల్యే షకీల్ మండిపడ్డారు.
Also Read: Telangana Omicron: తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు... 182 కరోనా కేసులు, ఒకరు మృతి
Also Read: Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌కు నోటీసులిచ్చాం, అయినా.. సైబరాబాద్ కమిషనర్ వెల్లడి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి