బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆర్మూర్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. త్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్రిబుల్ ఐటీ విద్యార్థులకు బాసటగా నిలిచేందుకు వెళ్తుండగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. త్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు బెదిరించడం సరికాదన్నారు బీజేపీ లీడర్లు. త్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదుల, టెర్రరిస్టుల అని ప్రశ్నించారు. విద్యార్థులకు భరోసా కల్పించేందుకు వెళ్తున్న బండి సంజయ్ టోల్‌ప్లాజా వద్ద అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థుల డిమాండ్లు సిల్లీ గ ఉన్నాయనడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు మెదపకపోవడం వారు తీవ్రంగా తప్పు పట్టారు.


నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద నిజామాబాద్ గ్రామీణ రూరల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు 44 వ జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి గ్రామీణ నియోజకవర్గ ఇంచార్జ్ దినేష్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తూ విద్యాను వ్యాపారంగా మార్చేలాచర్యలు తీసుకుంటుందన్నారు. వెంటనే బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


త్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన ఆయన్ని మార్గమధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. త్రిపుల్ ఐటీకి వెళ్తున్న బండి సంజయ్‌ను సుమారు అరగంటపాటు కార్‌లోనే ఉంచి పోలీసులు త్రిబుల్ ఐటీ కి వెళ్లొద్దు అని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా త్రిపుల్ ఐటీకి వెళ్తానని బండి సంజయ్ తెలపడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యలను సిల్లి అని తీసేసిన సీఎం ఎందుకు మాట్లాడటం లేదన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తున్నారని విమర్శించారు.