Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీకి దేశంలో తిరిగి పునరుజ్జీవం పోసేందుకు, పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త యాత్ర భారత్ జోడో యాత్ర. ఈ యాత్ర తెలంగాణలో అక్టోబర్ 25 తర్వాత మొదలుకానుంది. రాష్ట్రంలోకి రాహుల్ పాదయాత్ర అక్టోబర్ 24న ప్రవేశించనుంది. తెలంగాణలో తొలుత మక్తలో నియోజకవర్గంలో ప్రారంభమై... ఆ తర్వాత నవంబర్ మొదటి వారంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలు కానుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏబీపీ దేశంకి తెలిపారు. జోడో యాత్రకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు జోరుగా కసరత్తు చేస్తున్నారు.  దేశ ప్రజల మధ్య ఐక్యత తీసుకొచ్చే లక్ష్యంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారు. 

 

ఈ నెలాఖరులో రాష్ట్రంలోకి ఎంట్రీ..  
దేశ ప్రజల మధ్య ఐక్యత తీసుకొచ్చే లక్ష్యంతో ఏఐసీసీ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అగ్రనేత రాహుల్ ఈ నెలాఖరుకు తెలంగాణలో ఎంట్రీ ఇవ్వనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో యాత్ర ప్రారంభం అవుతుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావుపల్లిలో ప్రవేశించి పిట్లం, పెద్దకొడపగల్, బిచ్కుంద, జుక్కల్ క్రాస్ రోడ్ల మీదుగా మద్నూర్ నుంచి మహారాష్ట్రకు సాగనుంది.  

 

జుక్కల్ లోనే 2 రోజులు.

రాహుల్ జోడోయాత్ర రూట్ మ్యాప్ పై చర్చించేందుకు గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లాలోని ముఖ్య నాయకులకు ఆహ్వానాలు అందాయి. రాష్ట్రంలో జోడోయాత్ర 359 కి.మీ. మేర సాగుతుండగా జుక్కల్ నియోజకవర్గంలోనే 2 రోజులు, 70 కిలోమీటర్ల మేర ఉండటంతో విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిపై చర్చించేందుకు మాజీమంత్రి షబ్బీర్ అలీని దిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. 

 

రోజుకు 10 నుంచి 15 కి.మీ. 

ఈ యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తోంది. రోజుకు పది నుంచి పదిహేను కిలోమీటర్ల మేర కొనసాగేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. దాదాపు 2 పాటు జుక్కల్ నియోజకవర్గంలో యాత్ర ఉండే అవకాశం ఉందంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. స్థానికులతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో జరిగే రాహుల్ భారత్ జోడో యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కసరత్తు కోసం ఈ నెల 4న మంగళవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రూట్ మ్యాప్ ఖరారవుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. 

 

భారత్ జోడో యాత్రతో జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం వస్తోందంటున్నారు జిల్లా కాంగ్రెస్ నేతలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉండేంది. ఆ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాహుల్ యాత్ర ఉపయోగపడుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.