Nirmal District: నిర్మల్ జిల్లా బాసర IIIT లో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శనివారం రాత్రి నుండి విద్యార్థులు ఆందోళన చేస్తున్న వేళ.. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుతో పాటు ఇతర బీజేపీ నేతలు బాసరకు బయలుదేరగా, మార్గమధ్యంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దారిలో వెళ్తున్న క్రమంలో నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్- నందన్ వద్ద ఎంపీ సోయం బాపురావుని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో ఎంపీ మాట్లాడుతూ.. ఇది నా పార్లమెంటు ఎరియా అక్కడికి వెళ్ళకుంటే ఎలా? ఇది ఏ రాజ్యం అంటూ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు ఎంపీని అదుపులోకి తీసుకున్నారు.
అటు బాసర IIIT ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో బీజేపీ నాయకులు IIIT ముట్టడికి ప్రయత్నించారు. బాసర IIIT వద్ద ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నిన్న (జూలై 30) రాత్రి నుంచి ఆందోళనలు
జూలై 30 శనివారం రాత్రి నుంచి ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మెస్ లో భోజనం చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూడా విద్యార్థులు నిరాకరించారు. ఇన్‌ఛార్జ్ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్ విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ విద్యార్థులు ఒప్పుకోలేదు. సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొనే వరకు ఆందోళన విరమించమని తేల్చి చెప్పారు.
ఇటీవలే ఫుడ్ పాయిజన్
ఇటీవల ఆర్జీయూకేటీలో ఆహారం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు మెస్ నిర్వాహకుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కొత్త వారిని నియమించారు. వారికి నాణ్యతగా భోజనం అందించాలంటూ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ వెంకటరమణకు ఇటీవల విన్నవించారు. దీంతో పాటు మరికొన్ని డిమాండ్లనూ వీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యలను 24వ తేదీలోపు పరిష్కరిస్తామని ఇన్‌ఛార్జి వీసీ వారికి భరోసా ఇచ్చారు. ఆ గడువు తేదీ ముగిసి ఐదు రోజులు పూర్తయినా డిమాండ్లను నెరవేర్చక పోవడంతో విద్యార్థులు శనివారం రాత్రి నుంచి మళ్లీ ఆందోళనకు దిగారు.