Armoor News: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలపై అడ్డగోలు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ఎంపీ అరవింద్ నీతి మాలిన కామెంట్లు చేస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ అధ్యక్షుడు జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇలా చేస్తే ఆయనకు చెప్పులతో సత్కారం చేస్తామని ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఆర్మూర్ లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 


‘‘ఎంపీ అరవింద్ ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్ ఎంపీ, సిగ్గు లేని యూజ్ లెస్ ఫెల్లో అని మండి పడ్డారు. "అరవింద్ ఒక సైకో, డ్రగ్స్ కు బానిస, నిత్యం మత్తులో ఉంటాడు. మామిడిపల్లి రైల్వే వంతెన తెచ్చింది నేను. 2017లో వంతెన మంజూరైనప్పుడు అరవింద్ ఎంపీ కూడా కాదు. మందికి పుట్టినోళ్లు మా వాళ్లే అనడం బీజేపీ నైజం. ఆర్మూర్ అభివృద్ధికి రూ.3 వేల కోట్లు తెచ్చా. నువ్వు ఎంపీగా ఎన్ని నిధులు తెచ్చావో చెప్పు. ఆర్మూర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా?’’


దమ్ముంటే ఎక్కడికొస్తావో రా..
ధైర్యం ఉంటే ఆర్మూర్ లో తనపై పోటీ చేసి గెలవాలని జీవన్ రెడ్డి సవాలు విసిరారు. ‘‘అరవింద్ లాంటి చదువు రాని ఎంపీ దేశంలోనే మరొకరు లేరు. చీడపురుగు. నిజామాబాద్ జిల్లాకు పట్టిన శని. పసుపుబోర్డు తేకుంటే వారం రోజుల్లో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మాట తప్పిన అబద్ధాల కోరు. ఎర్ర జొన్న రైతులకు మద్దతు ధర ఇప్పిస్తానని చెప్పి మాట నిలుపుకోలేదు. మామిడిపల్లి రైల్వే వంతెనను 2017లో మంజూరు చేయించా. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వంతెన నిర్మాణానికి స్వయంగా డిజైన్ చేయించా. అప్పటికి ఎంపీ కూడా కానీ అరవింద్ ఆ వంతెనని నేనే మంజూరు చేయించానని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధికి మూడు వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చా. బైపాస్ రోడ్లు సాధించా. ఆర్మూర్ ను రెవెన్యూ డివిజన్ గా మార్పించా. కొత్తగా ఆలూరు, డొంకేశ్వర్ మండలాలు చేయించా. కేసీఆర్ దార్శినిక పాలన వల్ల ప్రతీ ఇంట్లో సంక్షేమం, ప్రతీ కంట్లో సంతోషం కనిపిస్తుంది.’’


వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితరుల వర్గాలకు రూ.2,016 చొప్పున, వికలాంగులకు రూ.3,016 చొప్పున ఆసరా పెన్షన్లు వస్తున్నాయి. 30 పడకల నుంచి వంద పడకలకు మారిన ఆర్మూర్ ఆసుపత్రిలో ఇప్పటికే 20 వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగాయి. నియోజకవర్గంలో వేలాది మందికి సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీలు ఇప్పించా. కళ్యాణ లక్ష్మీ ద్వారా రూ.1,00,116లు ఇస్తూ పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేస్తున్నాం. రైతుబంధు ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు చొప్పున ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్ల రూపాయలకు పైగా పడ్డాయి.
 రైతు బీమా కింద చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున  బీమా సొమ్ము అందుతోంది. 


కేసీఆర్ కిట్లు రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తున్నారు. మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి మంచి నీళ్ళు వస్తున్నాయి. మిషన్ కాకతీయ వల్ల చెరువులు బాగుపడి ఇంత కుండ పోత వర్షాలు పడుతున్నా చెక్కు చెదరకుండా జలకళ ఉట్టి పడుతోంది. ఇరవై నాలుగంటల కరెంటు సరఫరా జరుగుతోంది. గురుకులాలు వచ్చాయి. ఒక్కో విద్యార్థి చదువుకు ఏడాదికి ఒక లక్షా 25వేల రూపాయల కు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. 


ఎంపీగా అరవింద్ ఏం చేసాడు? ప్రజల సమక్షంలో చర్చకు సిద్ధమా? నీ అయ్య టీఆర్ఎస్ పెట్టిన భిక్షతోనే బతుకుతుండు. నీ అయ్య 40 ఏండ్లు రాజకీయాల్లో ఉన్నా అరవింద్ ను ఎవరూ గుర్తు పట్టరు. కొత్త బిచ్చగాడు మాదిరిగా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న అరవింద్ ను మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి. అరవింద్ బతుకు అవినీతి మయం. 18 ముంపు గ్రామాల ప్రజల కోసం కొట్లాడిందే నేను. సిగ్గు, సోయి లేకుండా మాట్లాడుతున్న అరవింద్ ను జిల్లాలో తిరగనివ్వం’’ అని జీవన్ రెడ్డి మాట్లాడారు. 


కేసీఆర్ ఎవర్ గ్రీన్ సీఎం, బీజేపీకి డిపాజిట్లు కూడా రావు 
సీఎం కేసీఆర్ పై, టీఆర్ఎస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైనా జీవన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ ఔట్ డేటెడ్ సీఎం కాదని, ఎవర్ గ్రీన్ సీఎం అని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 15 సీట్లే వస్తాయని బండి సంజయ్ చిలక జ్యోతిష్యాలు చెప్పుతున్నారని ఆయన పేర్కొన్నారు. అసలు బీజేపీకి 15 సీట్లలో డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. బండి సంజయ్ నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని అన్నారు. సీఎం కేసీఆర్ పై, మంత్రి కేటీఆర్ పై బీజేపీ నాయకులు నోరూపారేసుకుంటే సహించేది లేదని జీవన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.