చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ... తెలంగాణ సీఎం కేసీఆర్ నోటికి మాటలు ఎక్కువ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ఇంట్లో ముఖ్యమంత్రి పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీతో కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ కు వెళితే రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున సీఎం కుర్చీ కోసం లొల్లి మొలైందన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు. రుణమాఫీ, డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భ్రుతి, దళిత, గిరిజనులకు 3 ఎకరాలుసహా ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేదు. ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో మళ్లీ కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరదీశారని మహాగాంలో ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ విమర్శించారు. 


ఇంటి జాగా ఉన్న వాళ్లందరికీ రూ.5 లక్షలిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పి రూ.3 లక్షలే ఇస్తానంటున్నారు. మాట తప్పి తప్పు చేశానంటూ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెంపలేసుకుని ప్రజలను క్షమాపణ కోరాలంటూ మహాగాం సభలో డిమాండ్ చేశారు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్ర 5వ దశలో 3వ రోజు పాదయాత్రలో భాగంగా ముథోల్ నియోజకవర్గంలోని మహాగాం చేరుకున్న యాత్రకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి బండి సంజయ్ ప్రసంగిస్తూ కేసీఆర్ వైఫల్యాలను వివరించారు. 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన' కింద తెలంగాణకు ప్రధాని మోదీ 2,40,000 ఇండ్లను మంజూరు చేశారు. తెలంగాణలో ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ.4 వేల కోట్లకుపైగా నిధులిస్తే... ఆ సొమ్మును దారి మళ్లించిన ఘనుడు కేసీఆర్. ఆ నిధుల సంగతేమైందని కేంద్ర మంత్రి లేఖ రాసినా స్పందన లేదన్నారు. 


‘80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయని నీతిలేని వ్యక్తి కేసీఆర్. ఇక నిరుద్యోగ భృతీ లేదు. రెండు నెలల్లో లక్షా 46 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది. ఈ గ్రామంలో రోడ్లు లేవు... తాగునీటి ఊసే లేదు. మిషన్ భగీరథ పథకం కింద ఈ గ్రామానికి నీళ్లు రావడం లేదు. మహాగాం గ్రామ సమస్యలను పరిష్కరించలేనోడు... దేశ సమస్యలను పరిష్కరిస్తాడా? బిజెపి అధికారంలోకి వచ్చాక నిలువనీడలేని పేదలకు ఇండ్లను కట్టించే బాధ్యత తీసుకుంటాం’ అని బండి సంజయ్ అన్నారు.


ఎరువులపై రైతులకు దాదాపు 36వేల రూపాయల సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏమీ చేయడం లేదన్నారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తున్నది కేంద్రంలోని మోదీ ప్రభుత్వమేనని, రైతుబంధు పేరుతో కేసీఆర్ మిగిలిన అన్ని సబ్సిడీలను ఎత్తేసిన ఘనుడు సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులను కేంద్ర ఇస్తోందని, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్రం ఇస్తున్న నిధులతోనే జరుగుతున్నాయని ప్రజలకు వివరించారు బండి సంజయ్. గురుకుల పాఠశాలల్లో పురుగుల అన్నం, విషపన్నం పెడుతున్నారు. బాసర IIIT లో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు రోడ్డుకెక్కితే కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారంటూ మండిపడ్డారు.


ఐదు సంవత్సరాల్లో దేశం కోసం, ధర్మం కోసం ఏడుసార్లు జైలుకు వెళ్లాను. ప్రజల కోసం ఉద్యమం చేస్తుంటే... రౌడీషీట్లు పెట్టి, జైల్లోకి పంపిస్తున్నాడు. తెలంగాణ తల్లిని బంధ విముక్తి రాలిని చేద్దామని, ప్రజా సంగ్రామ యాత్రలో ఎక్కడికి వెళ్లినా... ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి, తమ బాధలను చెప్పుకుంటున్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక అందరికీ న్యాయం జరుగుతుందని బండి సంజయ్ భరోసానిచ్చారు.