వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఓవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ‘తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు తెలంగాణలో పలు జిల్లాల్లో షర్మిలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. ఈ క్రమంలో షర్మిల తీరుపై ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో టిఆర్ఎస్ నాయకులతో కలిసి షర్మిల దిష్టిబొమ్మను మార్కెట్ యార్డ్ నుంచి రోడ్డుపైకి తీసుకొచ్చి ఎమ్మెల్యే రేఖా నాయక్ దహనం చేశారు.

  


కేసీఆర్ గురించి అలా మాట్లాడితే సహించం.. 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి షర్మిల మర్యాద లేకుండా మాట్లాడటం సబబు కాదన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణ ఎంత అన్యాయానికి గురైందో తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిష్టిబొమ్మ దహనం చేసిన తనువాత షర్మిల డౌన్ డౌన్ అంటూ నినదాలతో కార్యకర్తలు హొరెత్తించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గిరిజన ఆడబిడ్డలను రోడ్లపై పడేస్తుంటే అప్పుడు నువ్వు ఎక్కడున్నావు షర్మిలమ్మ అని రేఖా నాయక్ ప్రశ్నించారు. రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదిముబారక్ లాంటి పథకాలతో ఆదుకుంటున్నారన్నారు. షర్మిల రాజకీయం కోసం తెలంగాణలో తిరుగుతూ సీఎం కేసిఆర్ నే తిడుతుందని, ప్రజలు మొన్న బాగా బుద్ది చెప్పారు. ఇంకా మానకపోతే రాబోవు రోజుల్లో మరింతగా బుద్ధి చెప్తామని ఎమ్మెల్యే రేఖా నాయక్ హెచ్చరించారు.


‘ఒకప్పుడు TRS ఉద్యమకారుల పార్టీ.. ఇప్పుడు ‘గూండాల పార్టీ, బంధిపోట్ల పార్టీ’. ఒక మహిళ 3500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి, KCR మోసాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే.. ఓర్వలేక మాపై పెట్రోల్ దాడులకు పాల్పడ్డారు. ప్రజల పక్షాన నిలబడడం మా తప్పా? ఇది తెలంగాణ కాదు ఆఫ్ఘనిస్తాన్. కేసీఆర్ ఒక తాలిబన్ అని’ వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నర్సంపేటలో, హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించింది టీఆర్ఎస్ గూండాలు, పోలీసులే. టీఆర్ఎస్ గూండాలను వదిలిపెట్టి, మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీసులు కేసీఆర్ కు తొత్తుల్లా మారారు. నిబంధనలకు విరుద్ధంగా మా పార్టీ కార్యకర్తలను తీవ్రంగా కొట్టారు. దాడులు చేసే హక్కు పోలీసులకు ఎక్కడిది? ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుని, గూండాలకు కొమ్ముకాస్తారా? ఒక మహిళపై దాడి చేయించడానికి కేసీఆర్ కు సిగ్గుండాలి. ఇది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం. కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆగదు’ అన్నారు షర్మిల. అయితే కేసీఆర్ ను తాలిబన్ అని, తెలంగాణను ఆఫ్ఘనిస్తాన్ అని షర్మిల చేసిన వ్యాఖ్యలపై గూలాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ కవిత, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మధ్య ట్వీట్ వార్ మొదలైంది.