ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ గ్రామంలో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. మెస్రం వంశీయులు   శనివారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించిన మహాపూజలతో నాగోబా జాతర ప్రారంభం అయింది. కాగా, నేడు హైదరాబాద్ నుంచి కేస్లాపూర్ నాగోబా జాతరకు హెలికాప్టర్ లో చేరుకుని నాగోబాను దర్శించుకున్నారు కేంద్ర మంత్రి అర్జున్ ముండా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.


వీరికి ఎంపి సోయం బాపురావ్, జిల్లా కలెక్టర్. బిజెపి జిల్లా నాయకులు సాదరంగా ఆహ్వనం పలికారు. హెలిఫ్యాడ్ నుండి నాగోబా ఆలయం వరకు గుస్సాడి నృత్యాలు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికిన మేస్రం వంశీయులు. నాగోబా ఆలయంలో నాగోబాకు హారతినిచ్చి దర్శించుకున్నారు అర్జున్ ముండా, బండి సంజయ్. అనంతరం నాగోబా ఆలయ కమిటీ, మెస్రం వంశీయుల ఆద్వర్యంలో కేంద్ర మంత్రికి , బిజెపి రాష్ట్ర అధ్యక్షుడీకి శాలువాలతో సన్మానించారు మెస్రం వంశ పెద్దలు. మేస్రం వంశీయులతో కలిసి జాతర విశేషాలు తెలుసుకున్న మంత్రి, అనంతరం దర్బార్ హాలులో ఎర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.


నాగోబాను దర్శించుకున్న అనంతరం కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా తెలంగాణ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నాగోబా దేవతను దర్శించుకోవడం అనందంగా ఉందని, చందాలు వేసుకొని నాగోబా మందిరం అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. జల్, జంగల్, జమీన్ హక్కులు  కల్పించడంలో సీఎం కేసీఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. ఆదివాసీలకు అడవే దేవుడు.. కానీ తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల భూములకు పట్టాలు ఇవ్వడం లేదని, కనీసం కమ్యూనిటీ హక్కులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. 


అధికారంలోకి  రాగానే గిరిజనులకు పోడు పట్టాలు
రాబోవు రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. కొందరు  అడవులను మింగేస్తున్నారు. తెలంగాణ ట్రైబల్ మ్యూజియం నిర్మాణం కోసం కేంద్రం నిధులు విడుదల చేసింది. ఆదివాసీల ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని చెప్పారు. ఆదివాసీల కోసం కేస్లాపూర్‌ లో ధర్మశాల  నిర్మిస్తామని కేంద్ర మంత్రి అర్జున్ ముండా హామీ ఇచ్చారు.


ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండజ సంజయ్ మాట్లాడుతూ.. మెస్రం వంశీయులు ఆచారాలు , సాంప్రదాయాలను చూసి గర్వంగా ఉందన్నారు. సొంత నిధులతో ఆలయాన్ని నిర్మించుకోవడం, ఇక్కడ జాతరను చూస్తే ఆనందంగా ఉందన్నారు. ఆదివాసుల సమస్యల పరిష్కరించే దిశగా కృషి చేస్తామని నాగోబా జాతర అభివృద్ధి కోసం పాటుపడతామన్నారు.


తెలంగాణలో ఆదివాసీల అతిపెద్ద రెండో పండుగగా నాగోబా జాతర గుర్తింపు పొందింది. కేస్లాపూర్‌లో మెస్రం వంశీ యుల ఆధ్వర్యంలో నాగోబా ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. మెస్రం వంశీయులు నాగోబా ఆలయ నిర్మాణాన్ని 2018లో ప్రారంభించగా ఇటీవల పనులు పూర్తయ్యాయి. నాగోబా జాతరతో పాటు ఆలయ చరిత్రను భావితరాలకు అందించే లక్ష్యంతో తమ సొంత ఖర్చులతో నాగోబా ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మెస్రం కుటుంబీకుల ద్వారా పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి రూ. 4.67 కోట్లతో నాగోబా ఆలయంతో పాటు సతీ దేవత ఆలయ నిర్మాణం పూర్తి చేశారు.