TS Minister Vemula Prashanth Reddy: సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీలకు, రాజకీయాలకు, అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలంలో ఆదివారం ఒక్కరోజే సుమారు 6 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. అభివృద్ది చేస్తున్నది ఎవరు మాటలు చెప్తున్నది ఎవరు అని ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. ధర్మపురి అరవింద్ ను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలకు ఏమైనా మంచి చేయాలి కానీ తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తిట్టిన పర్వాలేదు కానీ ప్రజలకు మంచి చేయాలని సూచించారు. 


అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని విడగొట్టే మాటలు బంద్ చేయాలని హితవు పలికారు. పసుపు బోర్డు తెస్తా అని దొంగ బాండ్ పేపర్ రాసిచ్చి, పసుపునకు రూ.10 వేల మద్దతు ధర ఇప్పిస్తా అని రైతులను మోసం చేశాడంటూ దుయ్యబట్టారు. దొంగ హామీలతో గెలిచిన అరవింద్... గెలిపించిన ప్రజలకు నీ వల్ల ఒరిగింది ఏమీ లేదన్నారు మంత్రి వేముల. తాను పేద ప్రజలకు సిఎంఆర్ఎఫ్ ఇప్పించినట్లు.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పిఎంఆర్ఎఫ్ ఇప్పించాలని అడిగితే వ్యక్తిగత దూషణలు చేస్తున్నాడని మండిపడ్డారు.


బైక్ లేని కుటుంబాలు ఉంటాయా ?
కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కు బైక్‌లు ఉన్న కుటుంబం అర్హులు కారని చెబుతున్నారని, కానీ ఈ రోజుల్లో సైకిల్ మోటార్ లేని ఇల్లు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ దానికంటే మెరుగైంది, ఎక్కువ మందికి వర్తిస్తుందిని అన్నారు. అయినా ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి రానివారు, అందులో రాని కొన్ని ఆరోగ్య సమస్యలు, ఆపరేషన్లు కూడా ఉంటాయని తెలిపారు. అట్లా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేసుకున్న పేద ప్రజలకు తాను కేసిఆర్ ని అడిగి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఒక్క బాల్కొండ లోనే 10 వేల మందికి రూ. 40 కోట్ల వరకు ఇప్పించానని తెలిపారు మంత్రి వేముల. అలాగే కేంద్రంలో నీ బీజేపీ ప్రధాని మోదీ ఉన్నడు కదా.. నేను నా పరిధిలో ముఖ్యమంత్రిని అడిగి సహాయం చేసినట్టు నీవు కూడా ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి పేదలకు ఏమైనా ఆర్ధిక సహాయం చేయాలని సూచించారు. 


మంచి చేయమంటే పిచ్చి కూతలు కూస్తున్నారు
పేద ప్రజల కోసం తాను చేస్తున్నప్పటికీ, ఎంపీగా అరవింద్ కూడా కేంద్రం నుంచి సహాయం చేయాలని అంటే నోటికి వచ్చినట్లు పిచ్చి కూతలు కూస్తున్నాడని గుర్తుచేశారు. ఆ విషయం ఎంపీ అరవింద్ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు మంత్రి వేముల. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఒక్కసారి చేసిన పొరపాటు ప్రజలు మళ్ళీ చేయరని వాళ్లకు అన్ని అర్దం అవుతున్నాయన్నారు. ఎవరు ఎలాంటివారు అనేది ప్రజలు త్వరలోనే నిర్ణయిస్తారని ఎంపీ అర్వింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.