Nagoba Jatara : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయులు నిన్న అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో వేడుక ప్రారంభం అయింది. శనివారం ఉదయం 11 నుంచి అర్ధరాత్రి 12 వరకు మెస్రం వంశీయులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. ముందుగా మైసమ్మ దేవతకు, ఆ తర్వాత నాగోబా, సతీ, బాన్ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. గోవాడ్‌లో ప్రవేశం చేసిన మహిళలు 22 ప్రత్యేక పొయ్యిలను ఏర్పాటు చేసి మహాపూజలకు అవసరమైన నైవేద్యాన్ని తయారుచేసి అందించారు. మహాపూజలకు అరగంట ముందు నాగోబా ఆలయాన్ని గంగాజలంతో నిర్వాహకులు శుద్ధిచేశారు. పవిత్ర గంగాజలంతో అమ్మవారిని అభిషేకించారు. శనివారం రాత్రి 10 గంటల తర్వాత వెలిగించిన కాగడాలతో గోవాడ్ నుంచి నాగోబా ఆలయానికి వాయిద్యాలు వాయిస్తూ చేరుకున్న మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ప్రారంభించారు. ఈ నెల 28 వరకు జాతర కొనసాగనుండగా, ఉమ్మడి జిల్లా నుంచేగాక వివిధ రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శించుకునేందుకు రానున్నారు.
నాగోబా జాతరకు రానున్న కేంద్ర గిరిజన శాఖ మంత్రి
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కొలువైన ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాను దర్శించుకునేందుకు కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ ముండా రానున్నారు. ఆదివారం ఉదయం 10:45 గంటలకు హెలికాప్టర్ ద్వారా కేస్లాపూర్ చేరుకోనున్నారు. 11:00 గంటలకు నాగోబాను దర్శించుకొని మెస్రం వంశీయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడతారు. అనంతరం జాతరను సందర్శించి ఆదివాసీల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం స్థానిక నాగోబా దర్బార్ హాలులో ఎర్పాటు చేసిన సభలో అర్జున్ ముండా పాల్గోనున్నారు. ఆపై తిరిగి కేస్లాపూర్ నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ చేరుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేస్లాపూర్ లో ఏర్పాటు చేసిన హెలిఫ్యాడ్ ను పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించి కేంద్ర మంత్రి రానున్న కారణంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
నాగోబా ఆలయం నిర్మాణం
తెలంగాణలో ఆదివాసీల అతిపెద్ద రెండో పండుగగా నాగోబా జాతర గుర్తింపు పొందింది. కేస్లాపూర్‌లో మెస్రం వంశీ యుల ఆధ్వర్యంలో నాగోబా ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. మెస్రం వంశీయులు నాగోబా ఆలయ నిర్మాణాన్ని 2018లో ప్రారంభించగా ఇటీవల పనులు పూర్తయ్యాయి. నాగోబా జాతరతో పాటు ఆలయ చరిత్రను భావితరాలకు అందించే లక్ష్యంతో తమ సొంత ఖర్చులతో నాగోబా ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మెస్రం కుటుంబీకుల ద్వారా పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి రూ. 4.67 కోట్లతో నాగోబా ఆలయంతో పాటు సతీ దేవత ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. మెస్రం వంశీయులు 1956లో చిన్నపాటి ఆలయాన్ని నిర్మించుకొని నాగోబా జాతర నిర్వహించారు. మెస్రం వంశీయుల విన్నపం మేరకు ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జీ నగేశ్ అప్పట్లో రూ.3.80 లక్షలతో నాగోబా ఆలయంతో పాటు గర్భగుడి, సతీదేవత గుడి నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. మెస్రం వంశీయులు 2018 వరకు నాగోబా జాతర ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. జాతర సమయంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మెస్రం వంశీయులు నూతన నాగోబా ఆలయాన్ని అద్భుతంగా నిర్మింపజేశారు.