Nellore Train Accident : నెల్లూరు  జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ముగ్గురు మరణించారు.  నెల్లూరు జిల్లాలో శనివారం రాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జిపై ఇద్దరు పురుషులు, ఒక మహిళను గూడూరు వైపు నుంచి విజయవాడ వెళుతున్న నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు పురుషులు రైలు పట్టాలపైనే మృతి చెందగా, మహిళ బ్రిడ్జిపై నుంచి కిందపడి చనిపోయింది. పురుషులు రైలు పట్టాల పక్కన ఉండగా, మహిళ పట్టాలపై ఉందని, ఆమెను రక్షించబోయే క్రమంలో వాళ్లు చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే, సంతపేట పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. 


విజయవాడకు చెందిన వాళ్లు?


మృతదేహాల వద్ద లభించిన సంచుల ఆధారంగా వారి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. వీళ్లంతా బంధువులా, ఒకే కుటుంబానికి చెందినా వాళ్లా తెలియాల్సి ఉంది. ఘటనాస్థలి వద్ద లభించిన సంచుల్లో టీటీడీ లాకర్‌ అలాట్‌మెంట్‌ టికెట్టు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక ఫోన్‌ నంబరు కూడా లభించింది. ఒక సంచిలో విజయవాడకు చెందిన వార్డు ఎడ్యుకేషన్‌ సెక్రటరీ తెన్నేటి సరస్వతీరావు పేరుతో ఉన్న గుర్తింపు కార్డు దొరికింది. అందులోని వివరాలు ఆధారంగా  ఇద్దరు పురుషుల్లో ఒకరు సరస్వతీరావు అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. టీటీడీ లాకర్‌ అలాట్‌మెంట్‌ పేరుతో దొరికిన స్లిప్పులో రమేష్‌ నాయక్‌ అనే పేరు ఉందని పోలీసులు తెలిపారు. అయితే మృతుల్లో అతడు ఉన్నారా? లేదా? అని పోలీసులు విచారిస్తున్నారు. రైలు విజయవాడ వైపు వెళుతుండటంతో వీళ్లు ప్రమాదవశాత్తు పడిపోయారని తెలుస్తోంది.  



దిల్లీ మెట్రో కింద దూకి యువకుడు ఆత్మహత్య 


 మెట్రో రైలు కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు దిల్లీలో చోటుచేసుకుంటున్నాయి. మండి హౌస్ మెట్రో ట్రైన్ కింద పడి ఒక వ్యక్తి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని నిషాని అలీగా పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తరలిస్తుండగా అలీ మరణించాడని వెల్లడించారు. ఈ వారంలో ఇలాంటి రెండు ఘటనలు  చేటుచేసుకున్నాయి. మంగళవారం నాడు 16 ఏళ్ల యువకుడు నొయిడా గోల్ఫ్ కోర్స్ రోడ్ మెట్రో స్టేషన్‌లో రైలు కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెయిడా సెక్టార్ 36 వద్ద మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


లారీని ఢీకొన్న టెంపో 


వైఎస్ఆర్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని చాపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి శ్రీవారి దర్శనం చేసుకుని కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనే సమయంలో ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు అనూష, ఓబులమ్మ, రామలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న  పోలీసులు క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన చాపాడు పోలీసులు దర్యాప్తు చేశారు