RTC Bus For  లక్ష్మీపూర్: ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఆ గ్రామస్తుల బస్సు కళ నెరవేరింది. ఆ గ్రామస్తులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. విద్యార్థులు, రైతన్నలు, గ్రామస్తులు తమ అత్యవసరాల కోసం ఎడ్లబండ్లు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారానే రోడ్డు వరకు చేరుకుంటారు. ఆపై బస్సులు లేదా ఆటో జీపుల ద్వారా జిల్లా కేంద్రానికి వెళ్లవలసి వచ్చేది. అప్పటి ఎమ్మేల్యేకు పలుమార్లు విన్నవించుకున్న ఆ గ్రామస్తుల వైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నిమార్లు విన్నపాలు చేసినా పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన గ్రామస్తులు ఆశలు వదులుకున్నారు. కానీ తాజా ఎన్నికల తరువాత పరిస్థితి మారిపోయింది. అనుకున్నట్లుగానే ఆ గ్రామస్తులకు బస్సు సౌకర్యం ఇప్పుడు సాకారమైంది.




బస్సు కల నెరవేర్చిన ఎమ్మెల్యే..
ఆదిలాబాద్ జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఆ గ్రామస్తులు ఇటీవల గెలిచిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ని రిక్వెస్ట్ చేశారు. అంతే.. ఒక్క మాటతోనే ఆ గ్రామానికి బస్సు తెప్పించేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. లక్ష్మీపూర్ గ్రామానికి ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామం నుంచి ఆదిలాబాద్ కు వచ్చే విద్యార్థులకు ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ప్రతి చిన్న విషయానికి ప్రైవేట్ వాహనాలపై ఆధారపడే బాధ తప్పిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆదివారం బస్టాండు ఆవరణలో గ్రామస్తులు, డిపో మేనేజర్ కల్పనతో కలిసి లక్ష్మీపూర్ బస్సును జండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. 


ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా లక్ష్మీపూర్ గ్రామస్తులు వర్షాకాలంతో పాటు మిగతా సమయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  రోజులు తరబడి విద్యార్థులు, మహిళలు, వృద్ధులు కాలినడకన సైతం రోడ్డు వరకు వెళ్లే వారు. అక్కడనుండి రహదారి వరకు వచ్చి ప్రైవేటు వాహనాలు ద్వారా తమ అవసరాలనిమిత్తం పనులు చేసుకునే వారని చెప్పారు. గత పాలకులకు ఆ గ్రామస్తులు ఎన్నో మార్లు విన్నవించుకున్న వారు కనికరించలేదని, తన వద్దకు రాగానే ఒకే మాటలో ఆ గ్రామానికి బస్సు సౌకర్యం తెప్పించానని పేర్కొన్నారు. 
ఆదిలాబాద్ జిల్లా ప్రజలు నియోజకవర్గ స్థాయిలో తనకు ఏ పనున్నా, ఎలాంటి ఆపద ఉన్న నేరుగా సంప్రదించాలని ప్రజలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ తన సేవలను అందిస్తూ అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్, జోగు రవి, ఆకుల ప్రవీణ్, దశరథ్, సురేష్, రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.