Adilabad News: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దొంగచింత పంచాయతీ పరిధిలోనీ చిన్నుగూడకు చెందిన ఆత్రం భీంబాయి అనే గర్భిణికి గురువారం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. వెంటనే 108 సిబ్బంది దొంగచింతకు చేరుకున్నారు. కానీ అక్కడి నుంచి చిన్నుగూడకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. దానికి తోడు వర్షం. అందులోనూ ఆ గ్రామానికి వెళ్లే మార్గంలో వాగు ప్రవహిస్తోంది. దీంతో 108 సిబ్బంది రెండు కిలో మీటర్లు కాలి నడకన వెళ్లి వాగు దాటారు. వాగు ఒడ్డు వరకు వచ్చిన ఆ గర్భిణికి నొప్పులు ఎక్కువ కావడంతో స్థానిక మహిళలతో కలిసి సిబ్బంది గొడుగు కిందే పురుడు పోశారు. ఈక్రమంలోనే సదరు మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం వారిని జాగ్రత్తగా వాగు దాటించి.. 108 వాహనంలో ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తల్లీ బిడ్డలను పరీక్షించారు. ఇద్దరీ ఆరోగ్యం బాగుందని తెలిపారు. వర్షంలో కూడా రెండు కిలో మీటర్ల దూరం నడిచి వాగు దాటి పురుడు పోసిన 108 సిబ్బంది ఈఎంటీ శంకర్, పైలట్ సచిన్ కు ఆ కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. వారు చూపిన చొరవ వల్లే తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని సంతోషం వ్యక్తంచేశారు. 


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనీ ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు లేక ఆదివాసీలు ఎన్నో విధాలుగా కష్టాలు పడాల్సి వస్తోంది. అనేక గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక వాగులున్న చోటా వంతెనలు లేక ప్రమాదకరంగా వాగులు దాటుతూ కాలం వెళ్లదీస్తున్నారు ఆదివాసీలు. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడిచిన, ప్రత్యేక రాష్ట్రం తెలంగాణా ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తున్న కూడా పాలకులు ఆదివాసీల కష్టాలు దూరం చేయలేకపోతున్నారు. ప్రతీ ఏటా వర్షా కాలంలో ఎన్నో గ్రామాలకు రాకపోకలు లేక ఆదివాసీలు అనేక కష్టాలు పడుతున్నారు. గర్భిణీలు బాలింతలు ఆసుపత్రికి వెళ్లాలన్న ఇలాంటి తిప్పలు తప్పడం లేదు. వాగుల ఒడ్డున ప్రసవించి అదృష్ట వశాత్తు కొంత మంది బతికి బయట పడుతున్నా.. మరికొందరు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఐటీడీఏ అధికారులు ఆదివాసీల కష్టాలను దూరం చేసేందుకు రోడ్డు, వంతెన, సౌకర్యం లేని గ్రామాలకు రోడ్డు మరియు వంతెనలు ఎర్పాటు చెసి రవాణా సౌకర్యం కల్పించాలని ఆదివాసీలు కోరుతున్నారు.


ఇటీవలే రోడ్డు సౌకర్యం లేక అడవిలోనే ప్రసవించిన మహిళ


నిండు గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దారి సరిగ్గా లేకపోవడంతో అంబులెన్సుకు ఫోన్ చేసినా వచ్చే వీలు లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబానికి ఎడ్లబండే దిక్కయింది. రాళ్లు, గుంతల్లో చీకటి వేళ అటవీ మార్గంలో బిక్కుబిక్కు మంటూ వెళుతున్న ఆమెకు నొప్పులు ఎక్కువ అయ్యాయి. అర్ధరాత్రి పూట ఆ అడవి తల్లే పురుడు పోసింది. తప్పని పరిస్థితిలో మార్గ మధ్యలో అడవిలో ప్రసవ వేదనను అనుభవించిన ఘటన అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో చోటు చేసుకుంది. 


బజార్ హత్నుర్ మండలం గిరిజాయ్ పంచాయతీ పరిధిలోని ఉమర్ద గ్రామానికి చెందిన జుగ్నక కవితకు రాత్రి 8 గంటల సమయంలో నొప్పులు వచ్చాయి. దారి, వాహన సదుపాయం, లేకపోవడంతో పాటు 4 కి. మీ వెళితేనే ఆటో సౌకర్యం ఉంటుంది. తప్పని పరిస్థితిలో ఎడ్లబండిపైనే తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే 2 కి. మీ వెళ్లాక నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలోనే అంటే అడవిలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఎడ్లబండిపై గిరిజాయ్ గ్రామానికి వెళ్లి అక్కడి నుంచి ఆటోలో 12 కి. మీ దూరం ప్రయాణించి రాత్రి 12 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు. కనీస రహదారి, వాహనం  సౌకర్యం లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతూ ఆసుపత్రికి చేరుకున్నారు. ఎప్పుడు తమకు ఇలాంటి పరిస్థితులే అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై వైద్యులు మాట్లాడుతు.. అర్థరాత్రి 12 గంటకు ఆసుపత్రికి వచ్చారని ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.