Adilabad MP Soyam Bapu Rao - ఆదిలాబాద్ - ఆర్మూర్ రైల్వే లైన్ పై ప్రత్యేక దృష్టి సారించాలి..
- ఉమ్మడి జిల్లా ప్రయాణికుల కోసం మరికొన్ని రైళ్లను పొడిగించాలి..
- రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసిన ఎంపీ సోయం బాపూరావు
కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆదిలాబాద్ - ఆర్మూర్ రైల్వే లైన్ పనుల మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి ముందుకు రావడంలేదని, కేంద్ర రైల్వే శాఖ పూర్తిగా బడ్జెట్ నిధులను భరించి ఈ పనులను పూర్తి చేయాలని ఎంపీ సోయం బాపూరావు కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి పలు రైల్వే సమస్యలను విన్నవించారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ మంజూరి కోసం 50 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని గతంలో లేఖ ఇచ్చిన తెలంగాణ మంత్రులు ప్రస్తుతం దాని ఊసెత్తడం లేదని రానున్న బడ్జెట్లో కేంద్రమే పూర్తిగా భరించే విధంగా చొరవ చూపాలని ఎంపీ కోరారు.
అదేవిధంగా అదిలాబాద్ ఉమ్మడి జిల్లా రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని రైళ్ల రాకపోకలను పొడిగించి మరికొన్ని నిలిచిపోయిన రైల్వే లైన్లను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి సిర్పూర్ వరకు నడుస్తున్న భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ను బల్లార్షా వరకు పొడిగించి జిల్లా ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచాలని కోరారు. అదేవిధంగా దంపూర్ ఎక్స్ప్రెస్ 12791 సికింద్రాబాద్ - నాగపూర్ రైలు, హౌరా నుంచి నాగపూర్ వరకు సిర్పూర్ కాగజ్ నగర్ మీదుగా నడుస్తున్న రైళ్ళ సమయాలను ప్రయాణికులకు అణువుగా క్రమబద్ధీకరించి ఈ రెండు రైళ్ల లింక్ ను కలపాలని ఎంపీ సోయం బాపూరావు కోరారు.
సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలోని సంజీవనయ్య నగర్ కానీ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు. ట్రైన్ 12722, 13723 దక్షిణ ఎక్స్ ప్రెస్, హజ్రత్ నిజాముద్దీన్ రైళ్లను సిర్పూర్ కాగజ్ నగర్ లో నిలిచే విధంగా చూడాలని ఎంపీ కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి రానున్న రైల్వే బడ్జెట్లో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ఎంపీ తెలిపారు.