Kamareddy Master Plan Issue : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో రైతు జేఏసీ భవిష్యత్ కార్యచరణ ప్రకటించారు.  మాస్టర్ ప్లాన్ పై పోరాటం చేస్తామని ప్రకటించారు.  కామారెడ్డి పట్టణంలో మాస్టర్ ప్లాన్ రగడ కొనసాగుతూనే ఉంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేసేవరకు తగ్గేదే లే అంటున్నారు రైతులు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఐక్య కార్యాచరణ ప్రకటించింది రైతు జేఏసీ. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మూడు వారాలుగా రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విలీన గ్రామాల రైతులు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ లోపు విలీన గ్రామాలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయాలని నిర్ణయించారు. లేకపోతే వారి ఇళ్లను ముట్టడిస్తామని రైతులు తీర్మానం చేశారు. ఈ నెల 15న కుటుంబ సభ్యులతో కలిసి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రోడ్లపై ముగ్గులు వేస్తామని తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతామని, అందుకు పోలీసులు సహకరించాలని రైతులు కోరారు. మాస్టర్ ప్లాన్ పై కోర్టుల చుట్టూ తిరగడానికి ఖర్చు అవుతుందని, కోర్టు ఖర్చుల కోసం మద్దతు తెలిపే నాయకులు తమతో పాటు ఒక్కొక్కరు రూ. 10 లక్షలు ఇవ్వాలని వెంకట రమణ రెడ్డి కోరారు. ఈ నెల 20లోపు విలీన గ్రామాలకు చెందిన 9 మంది కౌన్సిలర్ లు  రాజీనామా చేయాలని రైతు జేఏసీ తీర్మానం చేసింది.


ఆ 9 మంది కౌన్సిలర్లు 



  • 1వ వార్డు గడ్డమిధి రాణీ 

  • 2వ వార్డు సుతారి రవి

  • 6వ వార్డు ఆకుల రూప

  • 9వ వార్డు పడిగే సుగుణ 

  • 10వ వార్డు ఉర్ధోడ వనిత

  • 11 వ వార్డు కాసర్ల శ్రీనివాస్

  • 12 వ వార్డు కాసర్ల గోదావరి

  • 13 వ వార్డు జే శంకర్ రావు

  • 35 వ వార్డు పోలీస్ క్రిష్ణాజీ రావు 


ఈ నెల 17న పాత రాజంపేటలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ మరోసారి  సమావేశo కానున్నట్లు తెలిపారు. 


మాస్టర్ ప్లాన్ పై స్టే కు నిరాకరణ 


కామారెడ్డి పట్టణంలో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ పై విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది హైకోర్ట్. అయితే కామారెడ్డి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు జరిగేేదేమీ లేదంది హైకోర్ట్. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ విషయంలో ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగుతోందని వ్యాఖ్యానించింది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదన్నది బెంచ్ వ్యాఖ్య. అయితే మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలను తీసుకుంటున్నామని అడ్వకేట్ జనరల్ తెలిపారు.  


మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా నిరసనలు 


కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... కామారెడ్డి పట్టణంలోని గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. మహా ధర్నాపేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనలో 8 గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేయాలని రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఇండస్ట్ర్రీయల్ జోన్ పేరుతో తమకు తీరని అన్యాయం జరుగుతోందని రైతులు మొదట్నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ పై బుధవారంతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. గురువారం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయాలని రైతులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే బాధిత రైతులు కామారెడ్డి పట్టణానికి చెందిన 49 మంది కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయాలని వినతి పత్రాలు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.