User Names In Twitter:


ఇన్‌యాక్టివ్ యూజర్ నేమ్స్ విక్రయం..


ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ మరో క్రేజీ ఆలోచనతో ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే యూజర్‌ నేమ్స్‌ని విక్రయించనున్నట్టు సమాచారం. ఆన్‌లైన్ వేలం ద్వారా యూజర్ నేమ్స్‌ని అమ్మేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నారంటూ కొన్ని నివేదికలు చెబుతున్నాయి. రెవెన్యూ పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటారని అంటున్నాయి. The New York Times రిపోర్ట్ ప్రకారం...ట్విటర్ ఇంజనీర్స్‌ ఇప్పటికే ఈ పనిలో ఉన్నారు. ఆన్‌లైన్‌లోనే యూజర్‌ నేమ్స్‌ని, ట్విటర్ హ్యాండిల్స్‌కు బిడ్ వేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇన్‌యాక్టివ్‌గా ఉన్న యూజర్ నేమ్స్‌ని అమ్మేస్తారన్నమాట. అయితే...ఇందుకు ఎంత మొత్తం ఛార్జ్ చేస్తారన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. "ఇన్‌యాక్టివ్‌గా ఉన్న యూజర్‌నేమ్స్‌ని విక్రయించాలని కంపెనీలో చర్చలు జరుగుతున్నాయి. విశ్వసనీయ వర్గాల ద్వారా ఇది తెలిసింది" అని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌లో ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే 150 కోట్ల మంది యూజర్స్‌ని తొలగిస్తామని ట్వీట్ చేశారు. చాలా రోజులుగా యాక్టివ్‌గా లేని అకౌంట్‌లను తీసేస్తామని చెప్పారు. ట్విటర్‌ను మస్క్ హస్తగతం చేసుకున్నప్పటి నుంచే ఈ పుకార్లు పుట్టాయి. తరవతా ఆయనే స్వయంగా దాన్ని కన్‌ఫమ్ చేశారు. అయితే...ఈ మధ్య కాలంలో కొందరు అడ్వర్‌టైజర్లు ట్విటర్‌తో డీల్ క్యాన్సిల్ చేసుకున్నారు. రెవెన్యూ ఆశించిన స్థాయిలో లేదని మస్క్ అలా చెప్పారో లేదో వెంటనే ప్రకటనలు ఆపేశాయి ఆయా సంస్థలు. అందుకే... వీలైనంత త్వరగా రెవెన్యూని బూస్టప్ చేసుకునేందుకు..ఇలా కొత్త యూజర్ నేమ్స్‌ని విక్రయించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. 






గిన్నిస్ రికార్డ్..


ఆస్తిపాస్తులను సంపాదించడంలోనే కాదు, పోగొట్టుకోవడంలోనూ ఎలాన్‌ మస్క్‌దే రికార్డ్‌. ప్రపంచ నంబర్‌ వన్‌ బిలియనీర్‌ స్థానం నుంచి రెండో ర్యాంక్‌కు పడిపోయిన ఈ లక్ష్మీపుత్రుడు, సంపద కోల్పోవడంలో రికార్డ్‌ సృష్టించారు. ఆయన ఎంత పోగొట్టుకున్నారంటే... ఆ పతనాన్ని రికార్డ్‌ను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ (Guinness World Records) కూడా గుర్తించింది. ప్రపంచంలోనే అతి ఖరీదైన ఎలక్ట్రిక్‌ కార్లను తయారు చేసే టెస్లా కంపెనీకి (Tesla Inc) ఎలాన్‌ మస్క్‌ CEO. ఆ కంపెనీలో అతి పెద్ద షేర్‌ హోల్డర్‌. 2022లో టెస్లా స్టాక్‌ భారీగా పతనమైంది. దీంతో, ఎలాన్ మస్క్ సంపదకు పెద్ద కన్నం పడింది. టెస్లా స్టాక్‌ పతనం వల్లే భారీగా వ్యక్తిగత ఆస్తిని పోగొట్టుకుని, ప్రపంచ రికార్డు సృష్టించారు. గత ఏడాది కాలంలో (2022లో) ఎలోన్ మస్క్ 180 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం, 2021 ముగింపు నాటికి, ఎలాన్ మస్క్ ఆస్తులు 320 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి, 2023 జనవరి ప్రారంభం నాటికి ఇవి 138 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇంత తక్కువ సమయంలో (కేవలం ఒక్క ఏడాదిలో) అంత పెద్ద ఆస్తి (180 బిలియన్ డాలర్లు) పోగొట్టుకున్న ఎలోన్ మస్క్, 22 ఏళ్ల గిన్నిస్‌ రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఈ రికార్డు జపనీస్ టెక్ ఇన్వెస్టర్ మసయోషి సన్ పేరిట ఉంది.