Adilabad Heavy Rain: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జిల్లాలో జనజీవనం స్తంభించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సాగునీటి జలాశయాలు నిండుకుండలా మారాయి. 


కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం, కౌటాల, బెజ్జూర్, తీర్యాని, ఆసిఫాబాద్, వాంకిడి మండలాల్లో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని దహేగాం మండలంలో లోతట్టు గ్రామాలు జలమయం కాగా, కల్వర్టుల పైనుంచి వరద పారుతోంది. ఈ ప్రవాహంతో దహేగాం నుంచి కాగజ్‌నగర్‌కు రాకపోకలు స్తంభించాయి. 


మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మండలం రాంనగర్ బ్రిడ్జి వరద ఉద్ధృతికి పంట పొలాలు నీట మునిగి చిన్న తిమ్మాపూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం తర్ణం వాగు ఉప్పొంగడంతో ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్ర చంద్రపూర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు వానాకాలం సీజన్ పంటలకు మొత్తంగా ఊపిరి పోశాయి. 


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైది. నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 25వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో చేరడంతో 2 గేట్లు ఎత్తారు. ప్రాజెక్టు దిగువున 15 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలకు కుమ్రం భీం ప్రాజెక్టుకు భారీ వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 అడుగులు కాగా, 5 గేట్లను ఎత్తివేసి 237.65 అడుగుల నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. 


దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ చేశారు. భారీ వర్షాల కారణంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సెలవు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బోథ్, సిరికొండ పాఠశాలలకు జిల్లా ఇంచార్జి విద్యాధికారి కుష్బూ గుప్తా సెలవు ప్రకటించారు.


వరద ముంపు నుంచి గర్భిణీని కాపాడిన పోలీసులు 


మంచిర్యాల జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని నర్సాపూర్ గ్రామంలో వరద తీవ్రంగా ఉండడంతో ఓ గర్భిణీనీ, ఆమె కుటుంబ సభ్యులు వాగు దాటించే ప్రయత్నాలు చేశారు. ఇబ్బందులు ఎదురుకావడంతో అక్కడి స్థానిక పోలీసులు తాడు సహయంతో గర్భిణిని వాగు దాటించారు. తాండూర్ ఎస్సె కిరణ్ కుమార్, పోలీసు సిబ్బంది కలిసి తాడు సహాయంతో వాగు దాటి వెళ్లి గర్భిణీని సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేర్చారు. మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 




సమస్యలో ఉన్నామని తెలిసిన వెంటనే పోలీసులు వచ్చి తమకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని గర్భిణీ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమకు సహాయం చేసిన పోలీసులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రజలు సోషల్ మీడియాలోను ఎస్సై కిరణ్ కుమార్, పోలీసులు చేసిన సహాయాన్నీ ప్రశంసిస్తున్నారు.