Kaleshwaram Lift Irrigation Project | కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణలో రాజకీయ అలజడి కొనసాగుతున్న వేళ, మరో ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చర్చకు పెడుతోంది. ఆ ప్రాజెక్టు పేరు తుమ్మిడిహట్టి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులో భాగం. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించి తీరుతామని చెబుతోంది. అయితే అందుకు గల కారణాలు ఏమిటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు చరిత్ర ఇదే...
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును 2004లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. నాటి ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి, దీన్ని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులో తుమ్మిడిహట్టి ముఖ్యమైనది. ఆదిలాబాద్ జిల్లాలోని కౌటాల మండలంలో ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తులో ఒక బ్యారేజీ నిర్మించాలన్నది నాటి ప్రణాళిక. ఈ బ్యారేజీ ద్వారా నీటిని ఎత్తిపోసి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అయితే ఈ ప్రాజెక్టుపై మహారాష్ట్ర అభ్యంతరం లేవనెత్తింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది.
మహారాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని సూచన చేసింది. దీంతో 2014లో నాటి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును రీడిజైన్ చేసింది. ఈ కారణంగా తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన బ్యారేజీని పక్కన పెట్టి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద మూడు బ్యారేజీలను కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. దీనిపై నాటి నుంచి నేటి వరకు అనేక రాజకీయ, సాంకేతిక విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ చాలా తప్పులను ఎత్తిచూపింది.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ప్రయోజనాలు ఇవే..
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీని నిర్మించాల్సి ఉంది. ఈ డిజైన్ చాలా సాధారణమైనదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ బ్యారేజీ నిర్మిస్తే ఎలాంటి ఎత్తిపోతలు అవసరం లేకుండా గ్రావిటీ (గురుత్వాకర్షణ శక్తి) ద్వారా కాలువల గుండా నీటిని ఆదిలాబాద్ జిల్లాలోని సాగు భూములకు తరలించవచ్చు అని చెబుతోంది. అంటే ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులలో భారీ మోటార్లు, పంపులు ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు. అలా కాకుండా గ్రావిటీ ద్వారా కెనాల్స్‌లో నీరు ప్రవహిస్తుంది. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం తగ్గుతుంది. భారీ మోటార్లు, పంపులు అవసరం లేదు, విద్యుత్ ఖర్చు మిగులుతుంది. అతి తక్కువ ఖర్చుతోనే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వ పెద్దలు చెబుతున్న కారణాలు ఇవే
కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న సాంకేతిక లోపాలే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్య కారణమని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. పీసీ ఘోష్ నివేదిక ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్, నిర్మాణం, నిర్వహణలో లోపాలను స్పష్టంగా ఎత్తిచూపిందని, మేడిగడ్డ బ్యారేజీ అస్థిరమైన ఇసుక నేల మీద నిర్మించారని, దీనివల్ల పిల్లర్లు ఇసుకలో కూరుకుపోయాయని తన నివేదికలో తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్టు భవితవ్యంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేమని, ఇది ఎంత సురక్షితమో కూడా చెప్పలేమని కాంగ్రెస్ మంత్రులు చెబుతున్నారు. తుమ్మిడిహట్టి వద్ద రబ్బర్ డ్యాం నిర్మించి, దాని ద్వారా నీటిని సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలకు తరలిస్తామన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. దీనివల్ల తాత్కాలికంగా తక్కువ ఖర్చుతో నీటిని తరలించే ప్రత్యామ్నాయ ప్రణాళికగా పేర్కొంటోంది. అంతేకాకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ కోసం అయ్యే భారీ ఖర్చు కూడా తగ్గుతుందని లెక్కలు చెబుతోంది.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం వెనుక రాజకీయ కారణాలు ఇవేనా?
ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చాక తనదైన ముద్ర అన్ని విషయాల్లో ఉండాలని భావించడం సహజం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, డిజైన్లు, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నాయని పదే పదే చెబుతూ వస్తోంది. కాళేశ్వరం తెలంగాణ వరమని బీఆర్‌ఎస్ పదేళ్ల పాటు చెబితే, ఇదే తెలంగాణకు శాపమని కాంగ్రెస్ నేతలు విపక్షంలో ఉన్నప్పుడు పదే పదే చెప్పారు. ఇక అధికారంలోకి వచ్చాక, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ నివేదికలోని అంశాలు కాంగ్రెస్‌కు ఒక పొలిటికల్ గేమ్ చేంజర్గా ఉపయోగపడుతున్నాయి.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పుడు ఈ కమిటీ నివేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో చర్చకు పెడుతోంది. తుమ్మిడిహట్టి నిర్మించడం ద్వారా బీఆర్‌ఎస్ తప్పులను తమ ప్రభుత్వం సరిచేస్తున్నామని చెప్పుకునే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పట్టు పెంచుకునే వ్యూహం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.