నిజామాబాద్ జిల్లాలో ఎన్ఐఏ దాడులతో నిషేధిత పీఎఫ్ఐ ముఖ్య నాయకుల గుండెల్లో గుబులు పుడుతోంది. పీఎఫ్ఐలో క్రియాశీలకంగా ఉన్న కొందరు సభ్యులు పరారీలో ఉన్నారు. నగరంలోని మాలపల్లిలో ఆ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అహాన్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తాజాగా సోదాలు నిర్వహించారు. అహాన్ కొన్ని రోజులుగా పరారీలో ఉన్నాడు. దీంతో ఎన్ఐఏ అధికారులు అహాన్ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా మరో 14 మంది పీఎఫ్ఐ సభ్యుల జాడ లేకుండా పోయింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అదుపులోకి తీసుకున్న నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇద్దరిని... ఎన్ఐఏ అధికారులు సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. పీఎఫ్ఐ ముసుగులో విద్రోహ, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగాలతో ఎన్ఐఏ జిల్లాలో 23 చోట్ల సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం అనుమానితులకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు.
జులై 4న పీఎఫ్ఎస్ఐ ఉగ్రవాద కార్యకలాపాల ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ నగరంలోని ఆటోనగర్లో అరెస్ట్ చేయగా... అదే నెల 6న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని చంచల్ గూడ జైలుకు తరలించారు. జైలులో ఉన్న నలుగురి ఇళ్లలో కూడా ఎన్ఐఏ తాజాగా సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మాలపల్లికి చెందిన సమీర్, మహ్మద్ ఫెరోజ్‌ను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. జిల్లావ్యాప్తంగా మరో 17మందికి నోటీసులు జారీ చేశారు. నోటీసుల్లో పేర్కొన్న తేదీల ప్రకారం వీరంతా హైదరాబాద్‌లోని ఎన్ఎస్ఐఏ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంది.
ఎడపల్లి మండలంలోని ఎంఎస్సీ ఫారంకు చెందిన షేక్ ముఖీమ్‌తోపాటు జిల్లా కేంద్రానికి చెందిన మరో ఇద్దరు సోమవారం విచారణకు వెళ్లినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ఎస్ఐఏ కార్యాలయానికి 9 మంది మాత్రమే విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. కాగా పోలీసుల అదుపులో ఉన్న సమీర్ నగరంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆటోనగర్‌లోని పీఎఫ్ఐ సెంటర్‌లో ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలిసింది. సమీర్ నుంచి డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్‌లో పలు వస్తువులను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మహ్మద్ ఫెరోజ్ ఆదిలాబాద్‌లో మీసేవ సెంటర్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి ల్యాప్‌ట్యాప్ తోపాటు పలు వస్తువులను స్వాధీనం చేసున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు జగిత్యాల, నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరిని నాంపల్లి కోర్టులో హాజరుపర్చినట్లు సమాచారం. కోర్టుకు ఎన్ఐఏ అధికారులు ల్యాప్‌ట్యాప్, డాక్యుమెంట్లుతోపాటు పలు ఆధారాలను సమర్పించినట్లు తెలుస్తోంది.
జాడ లేని అహాన్
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ అరెస్ట్ తర్వాత ఆ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అహాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అహాన్ ఫోన్ స్విచ్ఛాప్ చేయగా, అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అహాన్ జాడ మాత్రం ఇంత వరకు దొరకలేదు. పీఎఫ్‌ఐలో యువతను చేర్చుకోవడంతోపాటు సంస్థ కార్యకలాపాలు ఆహాన్ ఆధ్వర్యంలో జరిగాయని సమాచారం. పీఎఫ్ఐ శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ డైరీ ఆధారంగా పోలీసులు కేసు నమోదుచేశారు.
అబ్దుల్ ఖాదర్‌తోపాటు పీఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సాదుల్లా, సంస్థ సభ్యులు మోబిన్, ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసి వారిపై 6వ టౌన్ పోలీసులు దేశద్రోహం కేసు పెట్టారు. అప్పటి నుంచి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందిన మరికొందరు సభ్యులు పరారీలో ఉన్నారు. ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసే సమయంలో అనుమానితులు లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరైన వారి వివరాలు ఎన్ఐఏ అధికారులు నమోదు చేసుకోగా హాజరుకాని వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయనే దానిపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. పరారీలో ఉన్న వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వారు జిల్లా నుంచి ఎక్కడి వెళ్లారు. ఎలా వెళ్లారు. ఇలా అన్ని కోణాల్లో ఆరా తీస్తోంది ఎన్ ఐఏ. ఇందులో జిల్లా పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పీఎఫ్ఐ కార్యకలాపాల్లో నిజామాబాద్ జిల్లానే కేంద్రంగా ఆ సంస్థ సభ్యులు చేసుకున్నట్లు తెలుస్తోంది.