Revanth Reddy Tweet on Collectorates : టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలు నాశనం అవుతున్నాయంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌ను, కలెక్టరేట్లను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ సంస్థలు, అధికారులు బాధితుల పక్షాన కాకుండా ప్రభుత్వానికే కొమ్ము కాస్తున్నారంటూ విమర్శించారు. ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై, అధికారులపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం కేసీఆర్ పాలన అంటే ఇదే అంటూ వ్యాఖ్యానించారు.
కొత్త కలెక్టరేట్లపై సెటైర్..
టీఆర్ఎస్ పాలనలో అందమైన కలెక్టరేట్లు కట్టారు.. కానీ అక్కడ పేదలకు న్యాయం చేయాల్సిన వ్యవస్థలు పతనమయ్యాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దాని ఫలితంగా న్యాయం కోసం కలెక్టరేట్ల చుట్టూ తిరిగి విసిగి వేసారిన పేదలు, రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొందని ట్విటర్ వేదికగా ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు, కలెక్టరేట్లకు అర్జీలతో రావాల్సిన బాధితులు పెట్రోల్ సీసాలతో వస్తున్నారని ట్వీట్ చేశారు. బాధితుల పక్షాన నిలవాల్సిన అధికారం దుర్మార్గులకు కొమ్ముకాస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తన భూమిని తన పేరిట సరిగ్గా రిజిస్ట్రేషన్ చేయించేందుకు లంచం డిమాండ్ చేయడంతో కొన్నే్ళ్లు కిందట ఓ రైతు పెట్రోల్ బాటిల్ తో ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చి నిప్పటించుకున్నాడు. ఆపై రాష్ట్రంలో ఎమ్మార్వోలు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. కొన్నిచోట్ల అయితే పెట్రోల్ ను ఖాళీ బాటిల్ లో పోసి ఇవ్వడాన్ని సైతం నిలిపివేశారు. రాష్ట్రంలోని కలెక్టరేట్లలో నిన్న (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం జరిగింది. రెండు వేర్వేరు కలెక్టరేట్ కార్యాలయాల వద్ద బాధితులు తమకు న్యాయం జరగడం లేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలు కలకలం సృష్టించాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఓ రైతు తన సమస్యను అధికారులు పరిష్కరించడం లేదనే మనస్తాపంతో కలెక్టర్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
తన పొలం ఆక్రమించారని ఫిర్యాదులు.. కానీ
మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామానికి చెందిన లోకేష్‌కు ఐదున్నర ఎకరాల భూమి ఉంది. తన పొలాన్ని పక్కన పొలం వాళ్లు అక్రమించుకున్నారని, ఈ సమస్యపై పలుమార్లు కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. తన సమస్యపై స్పందించి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో మనోవేదనకు గురైన లోకేష్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న సిబ్బంది ఇది గమనించి అతడిని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. లేకపోతే అతడు ప్రాణాలు కోల్పోయేవాడని ప్రతిపక్ష నేతలు తెలిపారు.
సూర్యాపేట కలెక్టరేట్‌లో మరో ఘటన..
తన భూమికి పట్టా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సూర్యాపేట కలెక్టరేట్‌లో యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబంతో పాటు ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన యువతి భూమికి పట్టా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ పెట్రోల్ పోసుకుంది. వెంటనే అప్రమత్తమైన కలెక్టరేట్ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అదనపు కలెక్టర్ మోహన్‌రావు గరిడేపల్లి తహసీల్దార్ తో ఫోన్లో మాట్లాడి యువతి సమస్య పరిష్కారానికి చొరవచూపారు. సమస్య పరిష్కరిస్తామన్న అడిషనల్ కలెక్టర్ హామీతో యువతి ఆందోళన విరమించి ఇంటికి తిరిగి వెళ్లిపోయింది.