బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర-4 ముగింపు సభను ఈనెల 22న వేలాది మందితో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట సమీపంలో ఆ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు.


నిన్న (సెప్టెంబరు 19) మేడ్చల్ నియోజకవర్గంలోని దమ్మాయిగూడలో ప్రజా సంగ్రామ యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు, ఇంఛార్జీలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్న ఈ సమావేశానికి బండి సంజయ్ తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్ జి.విజయరామారావు, డాక్టర్ చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్ర తీరు తెన్నులు, ముగింపు సభకు జన సమీకరణతోపాటు ప్రధాని నరేంద్రమోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న ‘సేవా పక్షం, బస్తీ సంపర్క అభియాన్, పార్లమెంట్ ప్రవాసీ యోజన, ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమాల పురోగతిపైనా సమీక్ష నిర్వహించారు.


అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 22 వరకు కొనసాగుతోంది. ముగింపు కార్యక్రమం 22న సాయంత్రం 4 గంటలకు ఇబ్రహీంపట్నంలోని పెద్ద అంబర్ పేట సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. స్థలం కూడా ఖరారైంది. ఈ సభకు కేంద్ర గ్రామీణాభివ్రుద్ది సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి సక్సెస్ చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలోనే పాదయాత్ర పేరిట దాదాపు 13 బహిరంగ సభలు నిర్వహించి విజయవంతం చేశామని అన్నారు. అధికారిక పార్టీ సహా మరే పార్టీ కూడా ఇంత తక్కువ సమయంలో ఈ సంఖ్యలో సభలు పెట్టిన దాఖలాలు లేవని అన్నారు.


‘‘ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. మన పాదయాత్ర స్పూర్తితో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. మీరంతా కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వస్తాం. కష్టపడే కార్యకర్తలకు, నాయకులకు న్యాయం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ ఇందుకు నిదర్శం’’ అని పేర్కొన్నారు.


ప్రజా గోస - బీజేపీ భరోసా
వీటితోపాటు జాతీయ నాయకత్వం నిర్ణయించిన ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’, దళిత సంపర్క్ అభియాన్, సేవాపక్షం వంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. దీంతోపాటు ప్రతి బీజేపీ కార్యకర్త తమ తమ నివాసాలపై కమలం పువ్వు గుర్తు ఉండేలా చర్య తీసుకోవాలని ఆదేశించారు. సగటున ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో కనీసం 5 చోట్ల కమలం పువ్వు గుర్తుతో వాల్ పోస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 25లోపు పోలింగ్ బూత్ కు సంబంధించి పూర్తిస్థాయి కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. 


4వ విడత పాదయాత్ర, పేద అంబర్ పేట బహిరంగ సభ మునుగోడు ఉప ఎన్నికపై ప్రభావం చూపడంతో పాటు బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఇమేజ్ పెరుగుతుండటంతో పార్టీని దెబ్బతీసేందుకు అధికార పార్టీ వేస్తున్న ఎత్తుగడలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.


పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు విజయరామారావు, డాక్టర్ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోందని చెప్పారు.