Rains in Telangana AP: తెలుగు రాష్ట్రాలలో పలు జిల్లాల్లో నేడు విస్తారంగా వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణలో నేటి నుంచి మూడు, నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని, దాని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. వాయువ్య మరియు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దిగువ ట్రోపో ఆవరణంలో బలమైన గాలులు వీస్తున్నాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
నేడు తెలంగాణ రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం ప్రభావం నేడు అధికంగా ఉండనుంది. నేటి నుంచి నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడనుంది.
రేపు ఇక్కడ భారీ వర్షాలు
రాష్ట్రంలో సెప్టెంబర్ 21న ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు భారీ వర్ష సూచనతో వాతావరణ కేంద్రం సెప్టెంబర్ 23 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ - టెక్కళి బెల్ట్, సోంపేట - ఇచ్చాపురంతో పాటుగా ఏలూరు జిల్లా, కొనసీమ, విశాఖపట్నం జిల్లాలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నేడు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదు కానుంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. రాయలసీమలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి - సూళూరుపేట బెల్ట్ లో వర్షాలు పడతాయి. ఈ ప్రాంతాల్లో రేపటి నుంచి కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.