Ukraine Crisis: కరోనా ఫస్ట్ వేవ్(Corona First Wave) సమయంలో కన్న కొడుకు కోసం 1,400 కిలో మీటర్లు స్కూటీపై ఒంటరిగా వెళ్లి కొడుకు సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చిన తల్లి గుర్తుందా?. ఆమెకు ఇప్పుడు మరో కష్టం వచ్చింది. ఈసారి ఆమె కుమారుడు ఉక్రెయిన్(Ukraine) లో చిక్కుకున్నాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన రజియా బేగం కరోనా ఫస్ట్ వేవ్ లో స్నేహితుడి పెళ్లికి వెళ్లి చిక్కుకున్న తన కుమారుడు నిజాముద్దీన్ కోసం స్కూటీపై 1400 కిలో మీటర్లు ప్రయాణించి కుమారుడిని క్షేమంగా ఇంటికి తెచ్చుకుంది.



దేశంలో ఎక్కడున్నా తీసుకొచ్చేసేదాన్ని : రజియా బేగం 


ఇప్పుడు ఈమె కుమారుడు నిజాముద్దీన్ అమన్ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్(MBBS) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో ఉంటున్నాడు. అయితే ఈ సుమీ సిటీ రష్యా సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఏబీపీ దేశం(ABP Desam) రజియా బేగంతో మాట్లాడింది. తమ కుమారుడిని క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని ఆమె వేడుకుంటుంది. ఏబీపీ దేశంతో మాట్లాడుతూ 'కరోనా ఫస్ట్ వేవ్ లో నెల్లూరులో చిక్కుకున్న నా బిడ్డను తీసుకొచ్చాను. ఇప్పుడు అతడు ఉక్రెయిన్ లో చిక్కుకున్నాడు. ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. యుద్ధం వలన అక్కడ చిక్కుకున్నాడు. రోజు వార్తలు చూస్తుంటే భయంగా ఉంది. కానీ మా బాబు న్యూస్ చూడవద్దంటున్నాడు. నేను అధికారులకు కూడా అప్పీల్ చేశాను. ఇండియాలో ఉంటే తీసుకొచ్చేదానిని, కానీ ఎక్కడో ఉక్రెయిన్ ఉన్నాడు. భారతీయ విద్యార్థులు అందరూ క్షేమంగా దేశానికి రావాలి. మా బిడ్డను క్షేమంగా తీసుకురావాలని ప్రధాని మోదీని వేడుకుంటున్నాను.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేడుకుంటున్నాను. తొందరగా మా అబ్బాయిని తీసుకోవాలని కోరుతున్నాను. మా అబ్బాయిని తీసుకొచ్చేందుకు సాయం చేయాలని సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమారు, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవితను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను' అని రజియా బేగం ఏబీపీ దేశంతో అన్నారు. 



మంచి నీరు కూడా దొరకడం లేదు : నిజాముద్దీన్ 


ఉక్రెయిన్ నుంచి నిజాముద్దీన్ ఏబీపీ దేశంతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ 'ఇక్కడ మంచి నీరు కూడా దొరకడం లేదు. ఫుడ్ అయిపోతుంది. ప్రతి రోజూ సైరన్లు వింటున్నాం. మా దగ్గర్లోనే బాంబులు పడుతున్నాయి. ఎంబసీ(Embacy) వాళ్లు బస్సులు పంపుతున్నారని వింటున్నాం. కానీ మా దగ్గరకు ఇంకా రాలేదు. మేముండే ప్రాంతం రష్యా బోర్డర్(Russia Border) దగ్గరగా ఉంటుంది. పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. ముందు అక్కడి నుంచి భారతీయులను తరలిస్తున్నారు. మా దగ్గర కూడా బాంబింగ్ మొదలైంది. ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు. ఎంబసీ వాళ్లకు సమాచారం అందించాం.  సుమీ ప్రాంతంలో 700 నుంచి 1500 మంది భారతీయులు ఉన్నారు.  ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి అందువల్ల బయటకు రాలేకపోతున్నాం. ఎయిర్ స్ట్రైక్స్(Air Strike) జరిగేటప్పుడు రోడ్లు బ్లాక్ ఉంటాయి అలాగే ప్రయాణం చేస్తే ప్రమాదం జరగవచ్చు.' అని అన్నారు.